జగన్ డబుల్ యాక్షన్..! రెండు ముక్కల్లో చెప్పేసిన మంత్రి ఆనం..!
ఏపీలో ఒకప్పుడు వైఎస్సార్సీపీలో ఉండి, అక్కడి రాజకీయాలు తట్టుకోలేక పార్టీ నుంచి బయటికి వచ్చి టీడీపీలో చేరి ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ తన మాజీ బాస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమిపై నిన్న జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఆనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
జగన్ కు రెండు క్యారెక్టర్లు ఉన్నాయని, ఒకటి పైనేమో మృదుత్వంగా.. లోపల మాత్రం కర్కషత్వంగా ఉంటుందని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తనను తిరస్కరించి ప్రజలు తప్పుచేశారన్నట్లు మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనం అని ఆనం తెలిపారు. గతంలో జగన్ గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహించి యువశక్తిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చివరికి తన ఉనికిని కాపాడుకునేందుకు రాష్ట్రానికి తాను అంతా మంచే చేశానంటున్నాడని విమర్శించారు.

కుప్పంలోని హంద్రీ-నీవా కాలువలో కృత్రిమ నీటిని పారించిన ఘనత జగన్ ది అన్నారు. తన హయాంలో అమాయకులను వాడుకుని వారి జీవితాలను నాశనం చేశాడని, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. విధ్వంసం, అరాచకాలు వైసీపీ సిద్ధాంతమని మంత్రి ఆనం తెలిపారు. ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలనే తపన, తాపత్రయం చంద్రబాబు ప్రభుత్వానిది అని ఆనం పేర్కొన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం కరవు కాటకాలతో ఉందని, కానీ చంద్రబాబు హయాంలో సస్యశ్యామలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఐదేళ్లపాటు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకునేందుకే జగన్ కాలం వెళ్లదీశారని, రాజధాని అమరావతిని నీరుగార్చినందుకు ఆ గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఆయన్ను ఛీకొడుతున్నారని మంత్రి ఆనం గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications