తిరుమలలో అరుదైన ఘట్టం- రేపే
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 59,834 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 24,628 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అల్పాహారం, పాలు పంపిణీ చేశారు.

కాగా- శనివారం తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం జరుగనుంది. దీన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విశేష ఉత్సవం సందర్భంగా తెల్లవారు జామున 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకువెళ్తారు అర్చకులు. అనంతరం ఆగమొక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అనంతరం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు. కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంత పద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తోంది టీటీడీ. ఈ ఏడాది కూడా దీన్ని వైభవంగా జరిపించనుంది.
శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీ.
తిరుమల శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఘనంగా నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications