ఆ నియోజకవర్గం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం?
ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. పార్టీ ఆవిర్భావం నుంచి తన సత్తా చాటుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో మంచి విజయాలు సాధించినప్పటికీ 2019 ఎన్నికల్లో ఉరవకొండ, హిందూపురం మాత్రమే గెలుచుకోగలిగింది. ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేయాలంటూ జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు బాబుపై ఒత్తిడి తెస్తున్నారు.

జిల్లా మొత్తం గెలుచుకోవచ్చు..
ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని, పార్టీకి లాభదాయకంగా ఉంటుందని కోరుతున్నారు. అయితే కుప్పం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి తాను పోటీచేస్తే శ్రేణులు ఢీలా పడతాయని, చంద్రబాబుకానీ, తెలుగుదేశం పార్టీకానీ భయపడ్డాయని అధికార పక్షం ప్రచారం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని చంద్రబాబు సుతిమెత్తగా చెప్పి వదిలేస్తున్నారుకానీ తమ్ముళ్లు మాత్రం వినడంలేదు.

వ్యతిరేకతను అవకాశంగా మలుచుకోవాలి
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వేవ్ కనపడుతోందని, వైసీపీపై ఉన్న వ్యతిరేకతను అవకాశంగా మలచుకొని అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవాలని పార్టీ భావిస్తోంది. జేసీ సోదరులు, పరిటాల కుటుంబం, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి లాంటి ఉద్ధండులతో జిల్లాలో బలంగా కనపడుతోంది. మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై, పరిటాల కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తర్వాత క్షమాపణలు చెప్పడం వంటివి వైసీపీకి మైనస్ గా మారాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

అభ్యర్థులను ముందే ప్రకటించాలి
అంతేకాకుండా టీడీపీకి అన్ని నియోజకవర్గాల్లో ఇద్దరేసి నాయకులు, ముగ్గురు నాయకులు పోటీపడుతుండటం కూడా పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుందని, వెంటనే జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తిని ఇప్పటి నుంచే ఎదుర్కోవడానికి అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. మొదటి మంత్రివర్గంలోను, రెండో మంత్రివర్గంలోను అనంతపురం జిల్లాకు చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, దీన్ని ప్రచారపర్వంలో చేరిస్తే ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి మరి.!












Click it and Unblock the Notifications