కేతిరెడ్డి ఎంట్రీలో ట్విస్ట్ ఇచ్చిన అనంతపురం ఎస్పీ
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాజాగా పోలీస్ సూపరింటెండెంట్ లేఖ రాశారు. కోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రిలో అడుగు పెట్టడానికి అనుమతి ఇవ్వాలంటూ గతంలో ఆయన రాసిన లేఖకు రిప్లై ఇచ్చారు ఎస్పీ. ఇందులో పలు కీలక అంశాలను పొందుపరిచారు. భద్రత, ఇతరత్రా కారణాల వల్ల తాడిపత్రికి వెళ్లడాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.
నిజానికి- నేడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లాల్సి ఉంది. దీనికి జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సరైన భద్రత కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీనికి గల కారణాలను ఈ లేఖలో వివరించారు. ఈ నెల 5వ తేదీ తరువాతే తాడిపత్రికి వెళ్లాలని సూచించారు. పోలీసులు తగినంత భద్రత కల్పించలేకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలను పేర్కొన్నారు.

- మొదటిది- గణేష్ నిమజ్జన బందోబస్తు విధులలో భాగంగా పోలీసు బలగాలలో ఎక్కువ భాగం కదిరి, హిందూపుర్‌లో మోహరించాల్సి వచ్చిందని జిల్లా ఎస్పీ.. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి వివరించారు. అనంతపురం రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు ఈ బలగాలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
- రెండవది- ఈ నెల 5వ తేదీన మిలాద్-ఉన్-నబీ పండుగ. ఈ పండుగకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందువల్ల పెద్దారెడ్డి భద్రత కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించలేకపోవచ్చు.
- మూడవది- తాడిపత్రి.. రాజకీయంగా అత్యంత సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతం. ఒక రోజు నోటీసుతో శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం చాలా కష్టం.
ఈ మూడు కారణాల వల్ల కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన తాడిపత్రి పర్యటనను ఈ నెల 5వ తేదీ తరువాతే పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం- ఆయన పర్యటనకు పోలీసు భద్రత కల్పించాలన్నా, భద్రతా ఛార్జీలను తెలియజేయాలన్నా కనీసం రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, శాంతిభద్రతల అవసరాలకు అనుగుణంగా పర్యటనను వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరారు.












Click it and Unblock the Notifications