ధోనీకి ఊరట: నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేసిన అనంతపురం కోర్టు
అనంతపురం: భారత ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పైన జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఏపీలోని అనంతపురం జిల్లా కోర్టు రద్దు చేసింది. మంగళవారం నాడు ఈ వారెంటును న్యాయస్థానం రద్దు చేసింది.
పది రోజుల క్రితం... న్యాయస్థానం ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ధోనీకి అనంతపురం కోర్టు జనవరి 8వ తేదీనాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో నోటీసులు పంపించినా కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయస్థానం ధోనీ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది.
ధోనీ పైన గత ఏడాది అనంతపురం జిల్లాలో కేసు నమోదయింది. ఓ వార పత్రికలో ధోనీని విష్ణుమూర్తి అవతారంలో చూపించారని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ నేత శ్యాంసుందర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.

ధోనీతో పాటు పత్రిక ఎడిటర్ పైన కూడా కేసు నమోదయింది. విష్ణు అవతారంలో ధోనీని చిత్రించి హిందువుల మనోభావాలను దెబ్బ తీశాడనే, దేవతలను అవమానించారని శ్యాంసుందర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. బిజినెస్ టుడే పత్రికలో ధోనీని విష్ణుమూర్తిగా చూపిస్తూ ప్రకటన ఇచ్చారు.
ఈ విషయమై గతంలోను అనంతపురం జిల్లా కోర్టు ధోనీకి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 7వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ధోనీ సమన్లు తీసుకున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరుకాకపోగా, కనీసం లాయర్ ద్వారా కౌంటరు కూడా దాఖలు చేయలేదు.
దీంతో అనంతపురం జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీవ్రంగా పరిగణించి ధోనీకి నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 25న హాజరుకావాలని లేకపోతే అరెస్ట్ చేసి హాజరుపరచాలని ఆదేశించింది. అనంతరం ఈరోజు (జనవరి 19న) వారెంటును రద్దు చేసింది.












Click it and Unblock the Notifications