హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు: బీజేపీతో పొత్తుపై ఇదే చివరి ప్రయత్నం
Chandrababu Naidu: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు విడతల్లో 75కు పైగా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారానికీ శ్రీకారం చుట్టింది.
అటు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోన్నారు. జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో సీట్ల పంపకాలు, అభ్యర్థుల జాబితాపైనా కసరత్తు సాగిస్తోన్నారు.

తమ కూటమిలోకి బీజేపీని కూడా కలుపుకోవాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ. దీనికోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. ఉమ్మడిగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనాలని భావిస్తోంది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సంసిద్ధంగా ఉన్నారు.
ఈ పరిణామాల మధ్య చంద్రబాబు బుధవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి ఢిల్లీకి వెళ్తారు. గురువారం ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వేర్వేరుగా సమావేశమౌతారు. పొత్తు అంశాలపై చర్చిస్తారు. సీట్ల పంపకాల గురించీ మాట్లాడతారు.

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ఎంతో సమయం లేదు. జనసేనతో సీట్ల పంపకాలు, అభ్యర్థుల తుది జాబితా కొలిక్కి రావట్లేదు. ఈ నేపథ్యంలో- బీజేపీతో పొత్తుపై చంద్రబాబు చేస్తోన్న చివరి ప్రయత్నం ఇదే కానుంది. పొత్తుపై బీజేపీ పెద్దలను ఒప్పించేలా చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారని అంటున్నారు. చంద్రబాబు పర్యటన తరువాత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని అంటున్నారు.
సీట్ల పంపకాలపై ఈ నెల 8వ తేదీన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మలి విడత భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ కూడా తమతో కలిస్తే జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారం మరింత ఆలస్యమౌతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications