ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కోసం వైసీపీ సిద్ధమా
AP Assembly election 2024: గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం. ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ పరిధిలోని జనరల్ సీటు ఇది. బెస్తవారిపేట, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. సంఖ్యాపరంగా రెడ్డి సామాజిక వర్గీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు.
వారికి సమానంగా తెలగ, యాదవ సామాజిక ఓటర్లు ఉంటారు. వైశ్యులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటారు. రాజకీయంగా మాత్రం రెడ్లదే హవా. 1955 నుంచి 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో 12 సార్లు రెడ్డి అభ్యర్థులే గెలిచారు. అందరికంటే అత్యధికంగా పిడతల రంగారెడ్డి విజయం సాధించారు. మంత్రి, స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 10 సార్లు ఎన్నికలు జరగ్గా నాలుగుసార్లు ఆ పార్టీదే హవా. 1989, 2004లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 1985లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పిడతల రంగారెడ్డిని టీడీపీ మద్దతు ఇచ్చింది. ఒకసారి ప్రజారాజ్యం, రెండుసార్లు వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించాయి.
2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్ధిగా పోటీ చేసిన అన్నా రాంబాబు.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్ధి చంద్రశేఖర్‌పై 7,546 ఓట్ల మెజారిటీతో గెలుపుబావుటా ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీ మూడోస్థానంలో నిలిచిందా ఎన్నికల్లో. టీడీపీకి పడ్డ ఓట్ల శాతం 23. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీదే విజయం.

2019 ఎన్నికల్లో అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 81 వేలకు పైగా మెజారిటీతో విజయఢంకా మోగించారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా గెలిచిన ముత్తుముల అశోక్ రెడ్డి.. ఆ ఎన్నికలో టీడీపీ తరఫున పోటీ చేశారు గానీ.. భారీ ఓట్ల తేడాతో పరాజయాన్ని చవి చూశారు.
ఈ సారి కూడా అభ్యర్థిని మార్చింది వైసీపీ. అన్నా రాంబాబుకు బదులుగా మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ మూడు ఎన్నికల్లో కొత్త అభ్యర్థులతో ప్రయోగానికి దిగినట్టయింది. ఈ ప్రయోగం మరోసారి సక్సెస్ అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ.












Click it and Unblock the Notifications