17న ఏపీ మంత్రివర్గం కీలక సమావేశం: ఆ మరుసటి రోజే..!
అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ మధ్య ఈ సమావేశాలు ఆరంభమౌతాయి. ఆరు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీన్ని పొడిగించడమా? లేక కుదించడమా? అనేది ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సభలో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసింది. మూడు రాజధానులపైనా కీలక నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

18వ తేదీ నుంచి..
ఈ నెల 18వ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని కంటే ఒకరోజు ముందు మంత్రివర్గం సమావేశమౌతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఇదివరకు 17వ తేదీ నుంచి అసెంబ్లీని సమావేశ పర్చాలని భావించిన విషయం తెలిసిందే. దీన్ని ఒకరోజు వెనక్కి జరిపింది ప్రభుత్వం. 17వ తేదీన మంత్రివర్గ భేటీని నిర్వహించి.. ఆ మరుసటి రోజే అసెంబ్లీని సమావేశ పర్చాలని ముఖ్యమంత్రి తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పలు బిల్లులు..
ఈ పరిణామాల మధ్య 17వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశం అత్యంత కీలకంగా మారింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టదలిచిన పలు ముసాయిదా తీర్మానాలను మంత్రివర్గం ఆమోదిస్తుంది. రాష్ట్ర భవిష్యత్‌తో ముడిపడి ఉన్న కొన్ని కీలక బిల్లులను ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి అధికార పార్టీ రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. చట్టసభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే- పరిపాలన రాజధానిగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, న్యాయ రాజధానిగా రాయలసీమలోని కర్నూలును తీర్చిదిద్దే విషయంలో ఇక ఎంత మాత్రం కూడా జాప్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది.

టీడీపీ ఏం చేస్తుంది..?
ఇదిలావుండగా- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదివరకు ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు మితిమీరాయని ఆరోపిస్తూ ఇదివరకు టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహష్కరిస్తూ తీర్మానం చేసింది. తమ పార్టీ నేతలపైనే కాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది టీడీపీ.
Recommended Video

మళ్లీ మాక్ అసెంబ్లీ పెడతారా?
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఉప నేత అచ్చెన్నాయుడు సహా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇదివరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు. అప్పట్లో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ సారి ఆ పార్టీ వైఖరి ఏమిటనేది చర్చనీయాంశమౌతోంది. తన వైఖరిని శీతాకాల సమావేశాల కోసం కూడా కొనసాగిస్తుందా? లేక సభకు హాజరవుతుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. శీతాకాల సమావేశాలకు టీడీపీ హాజరు కావడానికే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications