అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు కొత్త ప్రణాళిక: ఢిల్లీ- ఎన్సీఆర్ మోడల్?
Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతి పూర్తిస్థాయి అభివృద్ధిపై దృష్టి సారించింది. 2029 నాటికి సమగ్రంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ దిశగా పలు నిర్ణయాలను తీసుకుంటోంది.
ఇప్పటికే అవుటర్ రింగ్ రోడ్ ఎక్స్‌ప్రెస్ వే జారీ అయింది అమరావతికి. దీని మొత్తం పొడవు 189 కిలోమీటర్లు. విజయవాడ-మంగళగిరి- గుంటూరు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. నందిగామ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, తెనాలి, సత్తెనపల్లిని కనెక్ట్ చేస్తూ ఈ ఓఆర్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మితమౌతుంది.

దీని నిర్మాణ అంచనా వ్యయం ఏకంగా 25,000 కోట్ల రూపాయలు. 2014లో రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తరువాత ఇంత పెద్ద మొత్తంలో రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్టును మంజూరు చేయడం ఇదే తొలిసారి కూడా కావడం చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ గతంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించిన విషయం తెలిసిందే.
భూసేకరణతో సహా అన్ని రకాల ఖర్చులను కేంద్రమే చెల్లిస్తుందని ఆమె స్పష్టం చేశారు అప్పట్లో. రాజధాని అమరావతిలో లాజిస్టిక్, రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడంలో భాగంగా 25,000 కోట్ల రూపాయల విలువ చేసే అతిపెద్ద ప్రాజెక్టును అమరావతికి మంజూరు చేసింది కేంద్రం.
ఈ అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఆధారంగా చేసుకుని అమరావతిని పొరుగు నగరాలకూ విస్తరించేలా ప్రణాళికలను రూపొందంచబోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ తరహాలో అభివృద్ది పర్చాలని భావిస్తోంది. అవుటర్ రింగ్ రోడ్ వల్ల అమరావతిలో గుంటూరు, విజయవాడ నగరాలు కలిసి పోయే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను రూపొందించాలంటూ చంద్రబాబా.. మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రాలు వేరైనప్పటికీ హర్యానాలోని భివాని, ఫరీదాబాద్, గుర్‌గావ్, జజ్ఝర్, కర్నాల్, రెవారీ, సోనీపట్, రాజస్థాన్‌లోని అల్వార్, భరత్‌పూర్, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్, గౌతమ్ బుద్ధనగర్, ఘజియాబాద్, హపూర్, మీరట్, ముజప్ఫర్‌నగర్ వంటి నగరాలు నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఢిల్లీ- ఎన్సీఆర్ అభివృద్ధి చెందింది.
అదే తరహాలో అమరావతి- విజయవాడ, గుంటూరు జిల్లాల పరిధిలోకి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి, రవాణా సహా ఇతర మౌలిక సదుపాయాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికను రూపొందించాలని, కనెక్టివిటీ మరింత మెరుగుపడేలా చూడాలంటూ చంద్రబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications