జగన్‌కు షాక్, 'సాక్షి' స్వాధీనంపై బాబు సీరియస్: ఎలా, పరిణామాలేంటి?
విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ప్రసారాలకు బ్రేక్ పడింది. ఏసీటీ మినహా అన్ని లోకల్ నెట్ వర్క్‌లలో ప్రసారాలను నిలిపివేసినట్లుగా చెబుతున్నారు.
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో సాక్షిలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారని అంటున్నారు. అదే సమయంలో, సాక్షి మీడియాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వాదనలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.
సాక్షి మీడియాను స్వాధీనం చేసుకునే విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ స్వాధీనం చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి? ప్రస్తుతం ఈ ప్రశ్నలు జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశమవుతున్నాయి.
సాక్షిని స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు చెప్పారు. తాజాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇది కేవలం బెదిరింపులేనని చాలామంది భావించి ఉంటారని, కానీ ప్రభుత్వం మాత్రం సీరియస్‌గా ఆలోచిస్తోందని అంటున్నారు.

జగన్ మీడియాను స్వాధీనం చేసుకుంటామని యనమల ప్రకటించగానే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆయనతో మాట్లాడింది. ఇది చాలా సీరియస్ విషయమేననే భావం ఆయన మాటల్లో కనిపించిందని అంటున్నారు. 'ఏపీ స్పెషల్ కోర్ట్స్ యాక్ట్ -2015 (ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల చట్టం) ఉపయోగించి సాక్షి మీడియా గ్రూపును స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే ఆ మీడియా గ్రూపు మీద యాజమాన్య నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. కాని ఒక మీడియాను స్వాధీనం చేసుకోవడం అంత సులభమా? అలా జరిగితే ఎదురయ్యే పరిణామాలను కూడా ప్రభుత్వం ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇతర సంస్థలను స్వాధీనం చేసుకోవడం వేరు. మీడియా సంస్థను స్వాధీనం చేసుకోవడం వేరు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల చట్టం-2015 రూపొందించారు. దీనికి గత నెలలో రాష్ట్రపతి ఆమోదం లభించింది. అవినీతిపరులైన ప్రభుత్వ ఉద్యోగుల పని పట్టడం కోసం ప్రభుత్వం ఆ చట్టం రూపొందించింది.
అక్రమంగా, అవినీతితో ఆస్తులు సంపాదించే ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను శిక్షించే అధికారం ఈ చట్టం ఇస్తుంది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగికి అక్రమ ఆస్తులు ఉన్నాయని తేలితే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుంది.

జగన్ అవినీతిపరుడని, అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బుతోనే మీడియా గ్రూప్ ఏర్పాటు చేశారని టిడిపి వాదిస్తోంది. ప్రత్యేక కోర్టుల చట్టం జగన్ సంస్థలకూ వర్తిస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఒడిశా, బీహార్లో చట్టాలున్నాయి.
అక్కడి చట్టాలను పరిశీలించాకే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కోర్టుల చట్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాస్తుల స్వాధీనానికి ఉపయోగించే చట్టాన్ని మీడియా గ్రూపు స్వాధీనానికి ఎలా ఉపయోగిస్తారనే సందేహం ఎవరికైనా రావొచ్చు.
మీడియాపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం, టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిషేధించడం ఇప్పటివరకు చూశాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ పనే చేశారు. కాని ఏపీ సర్కారు మాత్రం మీడియా సంస్థను స్వాధీనం చేసుకుంటానని చెబుతోంది.
కాని యనమల రామకృష్ణుడు 'ప్రత్యేక కోర్టుల చట్టం ప్రకారం ఏ అక్రమ ఆస్తినైనా స్వాధీనం చేసుకోవచ్చనని తనతో మాట్లాడిన ఆంగ్ల పత్రికకు చెప్పారని తెలుస్తోంది.త సాక్షిని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం చెప్పడానికి అది అటాచ్‌మెంట్‌లో ఉండటమే కారణమని అంటున్నారు.
జగన్ ఆస్తుల వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈడీ జగన్ ఆస్తులలో కొన్ని అటాచ్ చేసింది. అంటే ఆ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరగకూడదు. అటాచ్ చేసిన ఆస్తుల్లో సాక్షి కూడా ఉంది. అటాచ్‌మెంటులో ఉన్న ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని టిడిపి నేతలు అంటున్నారు.
కాని ఇదెలా సాధ్యం? జగన్ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆయనను దోషిగానో, నిర్దోషిగానో తేల్చలేదు. అలాంటప్పుడు ఆయన ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా? ఈ సందేహానికి యనమల... సత్యం కంప్యూటర్స్‌ను ఉదాహరణగా చూపించారు.
మోసానికి పాల్పడిన సత్యంను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని టెక్ మహీంద్రా కొనుగోలు చేసిందన్నారు. అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదంటున్నారు. ఇదిలా ఉండగా, సాక్షిని స్వాధీనం చేసుకుంటే పోరాటం తప్పదని అంటున్నారు.












Click it and Unblock the Notifications