ఫిఫా ఫైనల్ తర్వాత మెస్సీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా- హృదయాన్ని తాకే సుదీర్ఘ పోస్ట్
ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సి రిటైర్మెంట్ ప్రకటించబోతోన్నాడా?, ఫిఫా ఫైనల్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించబోతోన్నాడా? ఇదే అతని చివరి మ్యాచ్ కాబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. మెస్సీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ దీనికి కేంద్ర బిందువు అయింది. యావత్ క్రీడా ప్రపంచాన్ని కదిలిస్తోంది. అందరినీ తనవైపు తిప్పుకొంది.
స్పెయిన్‌తో జరగబోయే ఈ ఫిఫా ఫైనల్ కు కొన్ని గంటల ముందు ఈ పోస్ట్ పెట్టాడు. అర్జెంటీనా జట్టు నైతిక స్థైర్యాన్ని రెట్టింపు చేసేలా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తోటి ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ ఉద్దేశించి అతను చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతీ క్రీడా ప్రేమికుడి హృదయాన్ని తాకాయి. దీంతో అర్జెంటీనా జెర్సీలో మెస్సికి ఇదే ఆఖరి మ్యాచ్ అవుతుందా అనే చర్చను రేకెత్తించింది. ఇప్పటికే క్రిస్టియానో రొనాల్డో, నెయ్ మార్.. రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇది హాట్ టాపిక్ అయింది.

మెస్సి తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడీ పోస్ట్ ద్వారా. ఆటగాళ్లతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించాడు. తాము సాధించిన ట్రోఫీలు, విజయాల కంటే కూడా ప్రతిరోజూ జట్టుతో గడిపిన సమయమే తనకు అత్యంత మధురమైనదని తెలిపాడు. కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడడం, పరాజయాల నుంచి పాఠాలను నేర్చుకుంటూ ప్రతి అడుగును ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను సాధించిన అతిపెద్ద సంపద.. అని మెస్సీ పేర్కొన్నాడు.
అర్జెంటీనా ఓ టీమ్ మాత్రమే కాదని, ఆత్మీయ కుటుంబంలా తనను తీర్చిదిద్దిందని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరి పాత్రను మెస్సి ప్రస్తావించాడు. తెరవెనుక నిరంతరం కష్టపడే కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్ కు అతను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ రకమైన ఐక్యతే తమ జట్టు సాధించిన విజయాలకు ముఖ్య ఆధారమని అభిప్రాయపడ్డాడు. ఫైనల్ లో ఫలితం ఎలా ఉన్నా గానీ ఈ టీమ్ పోరాటం ఎప్పటికీ చెరిగిపోని ఓ అద్భుత సువర్ణ అధ్యాయాన్ని చరిత్రలో లిఖిస్తుందని మెస్సి పేర్కొన్నాడు.
ఈ సుదీర్ఘ పోస్ట్.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు అతను అందించిన సాటిలేని సేవలను కొనియాడుతూ అభిమానులు భావోద్వేగ కామెంట్లు పెడుతున్నారు. మెస్సి భార్య ఆంటోనెలా రొకూజో సైతం ఈ భావోద్వేగ సందేశాన్ని చదివి కన్నీటి పర్యంతం అయ్యారు. భర్తపై ఉన్న అపారమైన ప్రేమ వ్యక్తం చేస్తూ విభిన్న ఎమోజీలతో స్పందించారు.












Click it and Unblock the Notifications