రంగా విగ్రహ ధ్వంసం: 'కాపు' హుందా, మెచ్చుకుంటున్న బందర్
విజయవాడ: మచిలీపట్నంలో దివంగత వంగవీటి రంగా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కాపు నాయకులు, ఆయన అభిమానులు హుందాగా వ్యవహరించారని చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా తగురీతిన స్పందించింది. ఘటనకు పాల్పడిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
విషయం తెలియగానే ఈ అనైతిక చర్యను నిరసిస్తూ రాధా, రంగా మిత్ర మండలి నాయకులు, ఆయా రాజకీయ పక్షాలకు చెందిన కాపు సామాజికవర్గ నాయకులు, రంగా అభిమానులు స్థానిక రేవతి సెంటరు వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపు రాస్తారోకో చేసి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన మచిలీపట్నంలో ఒకింత ఉద్రిక్తతను రేపింది. వివిధ ప్రాంతాల నుంచి కాపు సామాజిక వర్గ నాయకులు మచిలీపట్నం తరలి వస్తున్నారని ప్రచారం కావడంతో బయట ప్రాంతాల వారిలో మచిలీపట్నంలో ఏం జరుగుతోందో అన్న సంశయం వ్యక్తమైంది. పలువురు రాజకీయ నాయకులు ఈ దుశ్చర్యను ఖండించారు.

అయితే, రంగా అభిమానులు, ఆయా పక్షాల నాయకులు సంఘటనపై ఆగ్రహం వ్యక్తి చేసినా, వారు సంయమనంతో వ్యవహరించారు. ఇది మచిలీపట్నంలో అందరి ప్రశంసలు అందుకుంటోందంటున్నారు. రంగా కుమారుడు, మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ మధ్యాహ్నం సంఘటనా స్థలం వద్దకు వచ్చారు.
పరిస్థితిని తెలుసుకున్న ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ.. త్వరలో పోలీసులు దోషులను గుర్తించి తగు చర్యలు చేపడతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ లేనిపక్షంలో రంగా అభిమానులే తగు రీతిలో స్పందిస్తారన్నారు. మాజీ విప్ బూరగడ్డ వేదవ్యాస్ చోటుచేసుకున్న సంఘటన దురదృష్టకరమని, శాంతియుతంగా వ్యవహరించాలన్నారు.
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ మాట్లాడుతూ... ప్రభుత్వం కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం చేస్తున్న కృషిని జీర్ణించుకోలేక విగ్రహాలను పడగొట్టడం వంటి కుయుక్తులకు పాల్పడితే సహించేదిలేదన్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మరోవైపు, విగ్రహ ధ్వంసంపై కేసు నమోదయింది.












Click it and Unblock the Notifications