ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తున్న ఆంధ్రా ఊటీ!
శీతాకాలం ప్రారంభం అవుతుంది అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజల మనస్సు ఆంధ్రా ఊటీ అరకు మీద పడుతుంది. ఇప్పుడిప్పుడే అరకు అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని అరకు అందాలు ప్రకృతి ప్రేమికులకు సహజ సౌందర్యంతో కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం అరకు, పాడేరు, వంజంగి ప్రాంతాలలో పర్యాటకుల సందడి కనువిందు చేస్తుంది.
ప్రకృతి అందాల సోయగం అరకు
అరకు అందమంతా చలికాలంలోనే కనిపిస్తుంది. ఏజెన్సీ లో అరకు పర్యాటక కేంద్రాలు, లంబసింగి, వంజంగి, కొత్తపల్లి జలపాతం, చాపరాయి, బొర్రా గుహలు, పద్మాపురం గార్డెక్స్,మ్యూజియం మారేడిమిల్లి ఇలా పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులతో ఈ సీజన్ అంతా కిటకిటలాతూ ఉంటుంది. ఏజెన్సీలో మంచు కురవడం వలిసె పూలు ఇప్పుడిప్పుడే వికసిస్తూ ఉండటంతో ఎటు చూసినా ప్రకృతి అందాలే దర్శనం ఇస్తున్నాయి.

వంజంగి మేఘాల కొండలలో ఉదయ భానుడి దర్శనం
రోజు రోజుకు ఏజెన్సీ లో పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతూ వస్తుంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం పంజంగి మేఘాం పర్వతాలను తిలకించడానికి గత వారం రోజులుగా పర్యాటకులు పోటెత్తుతున్నారు. వంజంగి మేఘాల కొండలను తిలకించడానికి పర్యాటకులు తెల్లవారుజామునే వంజంగి వచ్చి మేఘాల నుంచి ఉదయించే సూర్యుడిని తిలకించి వింత అనుభూతిని పొందుతున్నారు.
ప్రకృతి రమణీయత అనుభూతి చెందుతున్న పర్యాటకులు
మేఘాల నుంచి ఉదయించే సూర్యుడు అలాగే పర్వతాలు మధ్య నుంచి పాల సముద్రం లా మంచు , మేఘాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఎంత చూసినా తనివితీరని ప్రకృతి అందాలతో పర్యాటకులు వింత అనుభూతి చెందుతున్నారు. సందర్శనకు వచ్చిన పర్యాటకులు వారి వద్ద ఉన్న సెల్ కెమెరాలతో ప్రకృతి అందాలను ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
రారమ్మని పిలుస్తున్న అరకుతో పాటు మన్యం సోయగాలు
ఆంధ్ర కశ్మీర్ లంబసింగి ప్రకృతి అందాలు కూడా ఇక్కడకు వచ్చిన సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద ఆవిష్కృతమవుతున్న మంచు మేఘాలు పర్యాటకుల మనసును హత్తుకుంటున్నాయి. నవంబర్,డిసెంబర్ నెలల్లో అయితే మన్యం అంతా పర్యాటకులతో కిక్కిరిసి పోతుంది. అయితే ఈసారి ఇప్పటి నుండే పర్యాటకుల సందడి కనిపిస్తుంది. అందాల అరకుతో పాటు మన్యం సోయగాలు పర్యాటకులను ఇప్పటి నుండే రారమ్మని పిలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications