andhra pradesh raj bhavan Governor vijayawada Coronavirus ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ గవర్నర్ విజయవాడ కరోనా వైరస్
ఏపీ రాజ్‌భవన్‌లో కలకలం: నలుగురికి పాజిటివ్
విజయవాడ: రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో కలకలం చెలరేగింది. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఒకేసారి నలుగురు రాజ్‌భవన్ ఉద్యోగులు వైరస్ బారిన పడటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. గవర్నర్‌కు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మందికి పరీక్షలను నిర్వహించినట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉంది.
నలుగురు రాజ్‌భవన్ ఉద్యోగులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ధృవీకరించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణ చర్యలను చేపట్టారు. రాజ్‌భవన్ మొత్తాన్నీ డిస్ ఇన్ఫెక్టెంట్తో శుభ్రం చేశారు.

రాజ్‌భవన్‌లో పనిచేస్తోన్న నలుగురు ఉద్యోగులు అనారోగ్యానికి గురి కావడంతో వారికి పరీక్షలను నిర్వహించారు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీనితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పరీక్షలను నిర్వహించారు. ఆయనతో పాటు రాజ్‌భవన్ కార్యాలయంలో పని చేస్తోన్న 10 మందికీ వైద్య పరీక్షలను నిర్వహించారు. ఒకేసారి నలుగురికి కరోనా వైరస్ ఎలా వచ్చిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం కృష్ణా జిల్లాలో భారీగా కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే. అత్యధిక కేసులు విజయవాడలోనే నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఒకరి ద్వారా ఈ వైరస్ రాజ్‌భవన్ వరకూ పాకిందా? లేక ఒకేసారి నలుగురూ వైరస్ బారిన పడ్డారా? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. రాజ్‌భవన్ మొత్తాన్నీ డిస్ ఇన్ఫెక్టెంట్తో శుభ్రం చేశారు. ఆ సమయంలో గవర్నర్, మిగిలిన సిబ్బందిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లారని చెబుతున్నారు.