విజయవాడలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: పోలీస్ కమిషనర్ కార్యాలయ ఉద్యోగిపై బుల్లెట్ల వర్షం
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ శివార్లలో కాల్పుల ఉదంతం సంభవించినట్లు నగర పోలీసులు వెల్లడించారు. మృతుడిని మహేష్‌గా గుర్తించారు. ఈ కాల్పుల వెనుక గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని నగర పోలీస్ కమిషనర్ బీ శ్రీనివాసులు వెల్లడించారు. విజయవాడ శివార్లలోని బైపాస్ రోడ్డు వద్ద గల ఓ బార్ వద్ద కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. టూవీలర్‌పై వచ్చిన వారు ముఖానికి మాస్కులను ధరించి ఉన్నారని, బార్ వద్ద మహేష్‌పై రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపి పారిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో మహేష్ సంఘటనా స్థలంలోనే మరణించారని అంటున్నారు.

Recommended Video
నిందితులను గాలించడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టామని అన్నారు. మహేష్‌ను కాల్చి చంపడానికి మోటివ్ ఏమిటనేది ఇంకా తెలియరాలేదని, ఆయన కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని చెప్పారు. కాగా- రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు ఈ ఘటనకు దారి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిపైనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం.. స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. విజయవాడలో క్రమంగా శాంతిభద్రతలు కొరవడుతున్నాయనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications