అసెంబ్లీ: సీన్స్ రిపీట్, పలకరింపులు కూడా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ కోసం ఏర్పాటైన శాసనసభ సమావేశాల తీరులో ఏ విధమైన మార్పు రాలేదు. గతంలో మాదిరిగానే సభా కార్యక్రమాలు స్తంభించాయి. చర్చను చేపట్టకుండా శాసనసభ వాయిదా పడింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య తీర్మానం ప్రతిపాదిస్తారనే ఊహాగానాలకు తెరపడింది.
సమైక్య తీర్మానం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. తెలంగాణ శాసనసభ్యులు సీమాంధ్ర శాసనసభ్యుల తీరుపై మండిపడ్డారు. సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ రేపటికి వాయిదా వేశారు. అంతకు ముందు రెండుసార్ల సభ వాయిదా పడింది.
శుక్రవారం ఉదయం ప్రారంభంకాగానే విపక్షాలు వివిధ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. సమైక్య, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ తెలుగుదేశం, సమైక్య తీర్మానం కోరుతూ వైయస్సార్ కాగ్రెసు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దీంతో సీమాంధ్ర ఎమ్మెల్యేలు పొడియం చుట్టుముట్టి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు.
స్పీక్ర ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను అరగంటపాటు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన మూడు నిముషాలకే వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పొడియంను చుట్టుముట్టి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. సభ సజావుగా నడవడానికి సభ్యులు సహకరించాలని స్పీకర్ నాదెండ్ల ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో రెండోసారి సభను గంట పాటు వాయిదా వేశారు. రెండు నిముషాలు కూడా సభ జరగకుండానే వాయిదా పడింది.

జూలకంటితో చేతులు కలిపిన ఈటెల
శాసనసభ మలి విడత సమావేశాల సందర్భంగా సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ కరచాలనం చేశారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తోంది.

శాసనసభ తీరుపై ఈటెల మండిపాటు
శానససభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై తెరాస శాసనశభా పక్ష నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రాజ్యాంగ ప్రక్రియను అడ్డుకున్న మొట్టమొదటి ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, స్పీకర్ సభా సంప్రదాయాలను కాపాడాలని ఆయన కోరారు. ఇందిరా పార్కు వద్ద సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు చేపట్టిన సంకల్ప దీక్షపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు.

సమైక్య తీర్మానం కోసం పట్టు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సమైక్య తీర్మానం చేయాలని పట్టుబడుతూ శాసనసభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.

తిప్పి పంపాలి...
రాష్ట్ర విభజన బిల్లును తిప్పి పంపాలని తెలుగుదేశం సీమాంద్ర శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. మెదక్‌లో సోనియా, కరీంనగర్‌లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు తెలుగువారి మధ్య చిచ్చు పెడుతున్నారని, రాష్ట్ర విభజనను చేపట్టారని ఆయన అన్నారు. 20 లోపాలున్న బిల్లును వెంటనే తిప్పి పంపించేందుకు సభలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నల్లబ్యాడ్జీలు ధరించి..
నల్లబ్యాడ్జీలు ధరించి తెలుగుదేశం సీమాంధ్ర శానససభ్యులు శాసనసభకు వచ్చారు. రాష్ట్ర విభజన బిల్లును వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇదేం రాజకీయం..
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ తప్పు పట్టారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.

మూర్ఖపు చర్య..
మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూర్ఖపు చర్య అని కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విరుచుకుపడ్డారు. అది తెలంగాణకు జరిగిన అవమానమని ఆయన అన్నారు.

శంకరరావు ఇలా..
శాసనసభా సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడతూ మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకరరావు ఇలా కనిపించారు.

సిపిఐ శాసనసభ్యులు ఇలా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్న సిపిఐ శాసనసభ్యులు శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగాలని అభిప్రాయపడుతున్నారు.

నాగంతో యెన్నం శ్రీనివాస రెడ్డి
బిజెపి సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి తన సహచర పార్టీ శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస రెడ్డితో మాట్లాడుతూ ఇలా కనిపించారు.

మాటలు కలిపిన వామపక్షాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్న సిపిఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ మాట్లాడుతూ కనిపించారు.

వీర సమైక్యవాదులు..
వీర సమైక్యవాదులైన కాంగ్రెసు శాసనసభ్యులు గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్ రెడ్డి శాసనసభ ఆవరణలో ఇలా కనిపించారు.

సమైక్యవాదుల ప్లకార్డులు
శుక్రవారం తలపెట్టిన బంద్‌కు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఇలా కనిపించారు.

అక్బరుద్దీన్‌తో జెసి...
మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కనిపించారు. జెసి రాయల తెలంగాణను ప్రతిపాదించగా, మజ్లీస్ దానికి మద్దతు పలికిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications