ఏపీ మంత్రివర్గ సమావేశం షెడ్యూల్ ఇదే: బడ్జెట్ ప్రాధాన్యతలు ఇవే
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం కుదిరింది. పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు- ఇతర ప్రతిపాదనలపై మంత్రులు చర్చించనున్నారు. మార్చి తొలి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- ఏపీ మంత్రివర్గం సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వచ్చేనెల 3న
మార్చి 3వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో చర్చించాల్సిన అంశాలు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను పంపించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని శాఖలు, విభాగాధిపతులకు సర్కులర్ జారీ చేసింది. శాఖలు, విభాగాల వారీగా బడ్జెట్ అవసరాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఇదివరకే తెప్పించుకుంది.

మేకపాటికి నివాళి..
ఇటీవలే గుండెపోటుతో కన్నుమూసిన ఐటీ, పెట్టుబడులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రివర్గం నివాళి అర్పిస్తుంది. అనంతరం ఈ సమావేశం ఆరంభమౌతుంది. ఆయన హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ పోర్ట్ ఫోలియోను తాత్కాలికంగా మరొకరికి అప్పగించే అవకాశం ఉంది. ఈ మంత్రివర్గ సమావేశంలోనే అది కూడా ఖరారవుతుంది. అలాగే- నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ (మెరిట్స్)ను వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చే ప్రతిపాదనలపైనా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.

రూ.2.40 లక్షల కోట్లతో..
వార్షిక బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం 2.40 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో అధిక కేటాయింపులు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన.. వంటి పథకాలను అమలు చేస్తోన్న నేపథ్యంలో విద్యారంగానికి బడ్జెట్‌లో ఈ సారి కూడా భారీగా కేటాయింపులు ఉంటాయని అంటున్నారు.

నాడు-నేడు కోసం..
నాడు-నేడు కింద రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేస్తోంది ప్రభుత్వం. దశలవారీగా ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సైతం మౌలిక సదుపాయాలను సమకూర్చుతోంది. ఇదివరకు 6,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించింది. ఇంకా పలు పాఠశాలలు మిగిలి ఉన్నందున మరోసారి అదే స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు ఉండొచ్చని చెబుతున్నారు.

వైద్యానికీ సమ ప్రాధాన్యత..
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన తరహాలోనే ఆసుపత్రులన్నింటికీ మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను భారీగా కేటాయిస్తుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. పాఠశాలలకు సమాంతరంగా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేయాల్సి ఉన్నందున- దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. రైతు భరోసా పథకం, ఉచిత బోర్లు.. వంటి పథకాలు అమలులో ఉన్నందున వ్యవసాయ రంగానికీ నిధులను మంజూరు చేయడంలో వెనుకాడకపోవచ్చు ప్రభుత్వం.

మూడు రాజధానుల బిల్లుపై..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కొత్త బిల్లు ఎలా ఉండాలనే విషయంపై వైఎస్ జగన్.. మంత్రివర్గ భేటీలో చర్చిస్తారని చెబుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకుని రావడానికి గల అవకాశాలను కేబినెట్ పరిశీలిస్తుందని, లేదా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేలా ఇప్పటి నుంచే కసరత్తు చేయడానికి అనుగుణంగా నిర్ణయాలు వెలువడొచ్చని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications