శుభవార్త: ఏపీలో 10వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే
అమరావతి: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ సాయంత్రానికి ముగిసింది. ఈ సమావేశంలో జూన్ 2న సీఎం చంద్రబాబు చేపట్టనున్న నవ నిర్మాణ దీక్ష, త్వరలో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలపై ప్రముఖంగా చర్చించారు.
నవ నిర్మాణ దీక్ష నేపథ్యంలో రాష్ట్రంలో వారం రోజులపాటు చేపట్టే కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో కొత్త పథకాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. జూన్ 8వ ఒంగోలులో మహా సంకల్ప సభ జరపాలని కేబినెట్ నిర్ణయించింది.
చంద్రన్న బీమా పథకం పేదలకు వర ప్రసాదం కానుంది. ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే రూ. రూ.3,62,500, సహజ మరణం సంభవిస్తే రూ.30వేలు, ప్రమాదంలో మృతిచెందితే రూ.5లక్షల చొప్పున పరిహారం అందుతుంది.
18 నుంచి 70 ఏళ్ల వయస్సున్న వారు, నెలకు రూ.15వేల కన్నా తక్కువ ఆదాయం కల్గినవారు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. ఈ పథకంలో చేరాలనుకునే వారు ఏడాదికి రూ.170ల బీమా ప్రీమియంగా చెల్లించాల్సి ఉంది.
దీంతో పాటు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9వతరగతి బాలికలకు లక్షా 80 వేల ఉచిత సైకిళ్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, రాష్ట్ర మంత్రులు చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబుతో పాటు పలువురు మత్రులు పాల్గొన్నారు.

ఏపీ కేబినెట్‌లో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
* కార్మికులకు చంద్రన్న బీమా పథకం
* తొలిదశలో 10 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం
* గ్రూప్1- 94, గ్రూప్2-750, గ్రూప్3 -1000 పోస్టుల భర్తీ
* హోంశాఖలో 6వేలు, వైద్యశాఖలో 422, ఇతర విభాగాల్లో 732 పోస్టులు భర్తీ
* తిరుపతిలో ఇంటర్నేషనల్ డిజిటల్ టెక్నాలజీ సెంటర్
* ఐదు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు
* రెండు విడతలుగా పల్స్ సర్వే
* తొలి దశ జూన్ 20-30, రెండో దశ జులై 5-20
* జూన్ 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీలు
* ప్రభుత్వ భవనాలపై సెల్ టవర్ల ఏర్పాటు
* అనంతపురం సోమందేపల్లి మండలం గుడిపల్లిలో ఎస్‌ఎల్ డిఫెన్స్ సొల్యూషన్‌కు 95 ఎకరాలు
* తద్వారా రూ.360 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ఉపాధి
* విశాఖ కృష్ణపాలెంలో కోకా కోలా కంపెనీకి 100 ఎకరాలు తద్వారా రూ.1300 కోట్ల పెట్టుబడి, 3645 మందికి ఉపాధి
* విశాఖ నక్కపల్లిలో ఫిషరీస్ క్వారమటైస్‌కు 30 ఎకరాలు
* విశాఖలో ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు 50 ఎకరాలు కేటాయింపు












Click it and Unblock the Notifications