బాబుకు చిక్కులు: ఎపి రాజధానికి నిధుల కొరత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధుల చిక్కులను ఎదుర్కుంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించిన తర్వాత దాని నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంచనాలు సాగుతున్నాయి. ఇది చంద్రబాబుకు పెద్ద సవాల్ కానుంది.
రాజధానిలో రోడ్లను, డ్రెయిన్లను, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి 20 వేల కోట్ల నుంచి 30వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఓ అంచనా. ఎకరానికి 75 లక్షల నుంచి కోటి రూపాయలు వ్యయం చేసి అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు.

వాటా ఇచ్చి భూమిని రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును డెవలపర్స్‌కు అప్పగించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ఇప్పుడు మనసు మార్చుకుని సొంతంగానే అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం తాను సేకరించిన నిధులను రుణమాఫీకి వినియోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు ప్రభుత్వం రైతుల సాధికారిత సంస్థను ఏర్పాటు చేసి 5 వేల కోట్ల రూపాయలను కేటాయించింది.
రుణమాఫీకి 25 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. దశలవారీగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని ఆలోచించినా ప్రభుత్వానికి భారీ మొత్తంలోనే సొమ్ము కావాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం అప్పులపై, కేంద్ర నిధులపై ఆధారపడింది. అప్పులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 20 వేల కోట్ల రూపాయల పరిమితి ఉంది. అప్పు తీసుకోవాలంటే ప్రభుత్వానికి 10 వేల కోట్ల రూపాయలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగతా నిధుల కోసం కేంద్రంపై ఆదారపడాల్సి వస్తుంది.
రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులపై విభజన బిల్లులో స్పష్టత లేదని ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం భావిస్తోంది. తాము భూమిని సేకరించి సిద్ధంగా ఉఁటే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అది కార్యరూపం దాలుస్తుందా అనేదానిపైనే అనుమానం.












Click it and Unblock the Notifications