కరోనా విలయం: ఏపీలో మద్యం.. తొలిరోజు అమ్మకాలు ఎంతో తెలుసా? జగన్‌పై కేంద్రం నజర్?
కొవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పైపైకి వెళుతోంది. రాష్ట్రంలో జనజీవనం, బిజినెస్‌లు తిరిగి కోలుకునేలా లాక్ డౌన్ ఎత్తివేతకు గల అన్ని అవకాశాలనూ సీఎం జగన్ వాడుకుంటున్నారు. ఆ క్రమంలోనే సోమవారం నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలు మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల మద్యం కొనుగోలుకు మందుబాబులు ఎగబడ్డారు.

మందుబాబులకు పండుగ..
దాదాపు 40 రోజుల గ్యాప్ తర్వాత ఏపీలో వైన్ షాపులు తెరుచుకోవడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర రద్దీ ఏర్పడింది. ధరల పట్టిక విషయంలో గందరగోళం తలెత్తడంతో మధ్యాహ్నం తర్వాతగానీ అమ్మకాలు మొదలుకాలేదు. సాయంత్రం 7 గంటలవరకు దుకాణాల్ని తెరిచే ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 మద్యం దుకాణాలు ఉండగా, లాక్ డౌన్ తర్వాత తొలిరోజు 2,345 దుకాణాలను తెరిచనట్లు అధికారులు చెప్పారు. ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలకు అనుమతివ్వలేదు.

సేల్స్ ఎంతంటే..
వైన్ షాపుల రీఓపెనింగ్ తొలి రోజు కావడంతో మందుబాబులు పోటెత్తారు. అయితే తొలిరోజు మొత్తంగా రూ.68 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నిజానికి వైన్ షాపులకు ధీటుగా బార్లలో సేల్స్ ఉంటాయని తెలిసిందే. టైంపాస్ కోసం మందు తాగే వాళ్లు ఇంట్లోనే ఉండిపోగా, కరడుగట్టిన మందుబాబులు మాత్రమే తొలిరోజు కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది. కాగా, చిత్తూరు జిల్లాలోని వైన్ షాపులకు తమిళనాడు నుంచి కూడా జనం పోటెత్తడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. తమిళనాడులో ఈనెల 7 నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

రెడ్‌జోన్‌లోనూ తెరిచారంటూ..
కరోనా కాలంలోనే యాక్టివ్ గా సాగిన ఏపీ పాలిటిక్స్.. ఇప్పుడు మద్యంచుట్టూ కేంద్రీకృతమైంది. ప్రజల నుంచి డబ్బులు దండుకోవడమే టార్గెట్ గా సీఎం జగన్ మద్యం ధరల్ని అమాంతం 25 శాతం పెంచేశారని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. పలు జిల్లాల్లో రెడ్ జోన్లలోనూ మద్యం అమ్మకాలు సాగించారని, రెడ్ జోన్ల లోని వ్యక్తులు.. గ్రీన్ జోన్లకు వచ్చి మద్యం కొనుకెళ్లిన ఘటనలూ చోటుచేసుకున్నాయని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.

కేంద్రం నజర్?
లిక్కర్ షాపుల రీఓపెనింగ్ సందర్భంగా నెలకొన్న కోలాహలానికి సంబందించి ఏపీ వీడియోలు దేశమంతటా వైరల్ అవుతున్నాయి. చాలా చోట్ల జనం సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమైపోవడాన్ని బీజేపీ, టీడీపీ నేతలు ఎత్తిచూపారు. ఏపీలో జరుగుతోన్న పరిణామాల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తున్నదని, హద్దులు మీరినట్లు తెలిస్తే ఏ క్షణమైనా లాక్ డౌన్ సడలింపుల్ని కేంద్రం వెనక్కి తీసుకునే అవకాశముందని కాషాయ నేతలు హెచ్చరిస్తున్నారు.