ఏపీలోని రైతుల అకౌంట్లలో డబ్బుల జమ
ఏపీలోని అన్నదాతలకు గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన బకాయిలను విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్ లో ధాన్యం విక్రయించిన రైతులకు రూ.675 కోట్ల బకాయిలను వారి బ్యాంకు ఖాతాల్లో వేయబోతోంది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వీటిని విడుదల చేస్తారు. అన్నదాతల మొత్తం బకాయి రూ.1675 కోట్లుగా ఉంది. గత నెలలో రూ.వెయ్యి కోట్లు విడుదల చేయగా, ప్రస్తుతం మిగతావాటిని విడుదల చేస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో జరిగే ఓ కార్యక్రమంలో మంత్రి మనోహర్ రైతులకు చెక్కులను అందజేస్తారు.
రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు
ఇటీవలే ఢిల్లీ పర్యటన జరిపిన మంత్రి మనోహర్ అక్కడినుంచే రైతుల బకాయిల్ని మొత్తం చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు అమలాపురంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లాల్లోనే రైతులకు అధిక మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో కార్యక్రమానికి అక్కడినుంచే శ్రీకారం చుడుతున్నారు. గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, తమ ప్రభుత్వం మాత్రం రైతుల బకాయిలు మొత్తం చెల్లించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

బియ్యంతోపాటు నిత్యావసరాలు
నిత్యావసరాల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతుండటంతో రైతుబజార్లద్వారా నాణ్యమైన బియ్యం, కందిపప్పును సబ్సిడీపై అందిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇంటింటికీ తిరుగుతున్న రేషన్ వాహనాల కొనుగోలులో గత ప్రభుత్వం పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడిందని, వీటి కొనుగోళ్లకు సంబంధించిన బకాయిల్ని ఇంతవరకు తిరిగి చెల్లించలేదన్నారు.
రేషన్ దుకాణాలద్వారా త్వరలోనే నూనెలు, ఉప్పు, గోధుమపండి, చక్కెర లాంటి ఇతర నిత్యావసరాలను కూడా అందించాలనే నిర్ణయాన్ని తీసుకున్నామని, త్వరలోనే వీటిని అమలు చేయబోతున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ ద్వారా గత ప్రభుత్వం రూ.40వేల కోట్ల అప్పులు చేసిందని, రుణాలు తెచ్చినప్పటికీ రైతులకు బకాయిలు మాత్రం చెల్లించలేదంటూ మంత్రి ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications