ఏపీలో కొత్త పథకాన్ని తెచ్చిన చంద్రబాబు... నెలకు రూ.30వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత పథకాల మీద పథకాలు ప్రారంభిస్తున్నారు. 2014-19 సమయంలో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ సంక్షేమానికి తక్కువ ప్రాధాన్యతే దక్కిందనేది చంద్రబాబు యోచన. ప్రస్తుత పాలనలో ఆ లోటును సరిదిద్దడానికి రోజుకో పథకాన్ని ప్రవేశపెడుతున్నారన్నా ఆశ్చర్యం లేదు. తాజాగా ఆయన ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం'తీసుకొచ్చారు. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది.
ఏడాదికి రూ.13 కోట్లు
ఈ పథకం ప్రకారం ఉర్దూ మీడియం పాఠశాల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులు, వాలంటీర్లను అందుబాటులోకి తెస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 185 మదర్సాలున్నాయి. నవీన విద్యాపథకం అమలు చేసేందుకు ఒక్కో మదర్సాలో ముగ్గురు వాలంటీర్లను నియమించనున్నారు. వీరికి అందించాల్సిన జీతభత్యాలపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏడాదికి రూ.13 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ ఈ పథకం అమలు చేసేందుకు ఇప్పటికే ఆమోదం తెలిపారు.

నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
దక్షిణాది రాష్ట్రాల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ప్రతి తరగతిలో 15 మంది విద్యార్థులు ఉంటూ, వారు ఉర్దూ మీడియంలోనే విద్యను అభ్యసిస్తుంటే ఉపాధ్యాయుల నియామకానికి ఈ నిధులను ఉపయోగించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం వీటిని వినియోగించుకోకుండా మూలన పడేసింది. కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదనలు తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో ఆమోదం లభించింది.
ఉపాధ్యాయులకు గౌరవ వేతనం కింద నెలకు రూ.30వేలు చెల్లించేలా కేంద్రం రూ.10 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1600 ఉర్దూ మీడియం పాఠశాలలు ఉండగా 238 పాఠశాలల్లో 15 మందికంటే ఎక్కువమంది విద్యార్థులున్నారు. చంద్రబాబునాయుడి నుంచి ఆమోదం లభించగానే ఉపాధ్యాయుల నియామకాన్ని ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications