ఏపీలో రైతులందరికీ శుభవార్తను ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనను పరుగులు తీయస్తున్నారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న లోటుపాట్లను పరిశీలించి అవి తమ ప్రభుత్వంలో తలెత్తకుండా జాగ్రత్తగా అమలుచేసుకుంటూ వస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రైతులకు సూక్ష్మ సేద్య పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా అన్నదాతల కోసం మరో నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ఈ-పంటలో నమోదైన రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేస్తోంది.
టెండర్లు పిలిస్తే ఆలస్యమవుతుంది
గత ప్రభుత్వ హయాంలో రైతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు ప్రభుత్వం వరుసగా సమీక్షించుకుంటూ వస్తోంది. దీనిలో భాగంగానే పంట బీమా నమోదులో అన్నదాతల వ్యయప్రయాసలను తగ్గించేందుకు ఈ-పంటలో నమోదైతే చాలు అని ప్రకటించింది. వచ్చే రబీ సీజన్ నుంచి 2019లో వైసీపీ ప్రభుత్వం రాకముందు ఏ విధానమైతే ఉందో దాన్ని వర్తింపచేస్తోంది.

ఈ విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, పంటల బీమా కోసం గత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను పూర్తిచేసిందని, ఇప్పుడు తిరిగి టెండర్లు పిలిస్తే ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అన్నదాతలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.
రబీ నుంచి కొత్త విధానం
ప్రస్తుతం ఉన్న ఖరీఫ్ సీజన్ కు పాత విధానమే అమలు చేసి వచ్చే రబీ సీజన్ నుంచి కొత్త విధానం అమలు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు నిర్ణయించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ ఉచిత పంటల బీమా విధానంలో పంట దెబ్బతిన్నప్పటికీ రైతులకు పరిహారం దక్కలేదని ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించింది. పంటల బీమా అమలుపై మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నారు. ఈ-పంటలో ఇప్పటికే నమోదైన రైతులకు ఖరీఫ్ లో ఉచిత బీమా విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం కూడా నిర్ణయించింది. రబీ సీజన్ కు మాత్రం రైతులు తమ వాటాను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications