తిరుమల కొండపై కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం
ఏపీలో చంద్రబాబు సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాలన పరుగులు తీస్తోంది. ముందుగా తిరుమల నుంచే ప్రక్షాళనకు శ్రీకారం చుడతానన్న సీఎం తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా శ్యామలరావును నియమించారు. ఆయన కొండపై అన్ని విభాగాలను తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు తాను తీసుకుంటున్న నిర్ణయాలను, చేపడుతున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ దృష్టికి తీసుకువస్తున్నారు. తాజాగా తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణ కోసం పూర్తిస్థాయిలో విద్యుత్తు బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా 250 బస్సులు
రెండు సంవత్సరాల క్రితం తొలిసారిగా తిరుమలకు విద్యుత్తు బస్సులు వచ్చాయి. అవి తిరుమల-తిరుపతి, తిరుపతి-రేణిగుంట, తిరుపతి-కడప, తిరుపతి-మదనపల్లె, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-శ్రీకాళహస్తి మధ్య నడుస్తున్నాయి. వీటికి ఛార్జింగ్ స్టేషన్లను సీబీఎస్ తోపాటు అలిపిరి డిపోలో కూడా ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో విద్యుత్తు బస్సులను నడిపించాలనే నిర్ణయంలో భాగంగా తిరుమల-తిరుపతి మధ్య 250 బస్సులను తిప్పబోతున్నారు. అధికారులు కొండపై బాలాజీనగర్ కు వెళ్లేమార్గంలో ఉన్న గ్యాస్ గోడౌన్ దగ్గర నాలుగు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. దీనిలో బస్సులకు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు.

సుప్రభాత సేవలో పాల్గొన్న డీజీపీ
రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమల వచ్చిన సందర్భంగా ఈ అంశాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన బాలాజీనగర్ దగ్గర ఉన్న స్థలాన్ని పరిశీలించి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించారు. వెంటనే ఆర్టీసీ తరఫున టీటీడీకి ప్రతిపాదనలు పంపించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కూడా ఆయనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకా తిరుమలరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో డీజీపీ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలను అందించారు.












Click it and Unblock the Notifications