గుంటూరు, విజయవాడకు వరం ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు పాలనను పరుగులు తీయిస్తున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా అధికారులంతా కష్టపడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కూరగాయలను పండిస్తున్న రైతులు నష్టపోకూడదని, వారికి మంచి ఆదాయం రావాలి, దళారీ వ్యవస్థను నిర్మూలించాలనే లక్ష్యంతో రైతుబజార్లను ఏర్పాటు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజువరకు ప్రజల జీవితాల్లో అవి విడదీయలేని భాగంగా మారిపోయాయి. కూరగాయలు కావాలంటే మార్కెట్ కు వెళ్లాలనే మాటను మరిచిపోయి కూరగాయలు కావాలంటే రైతు బజారుకు వెళ్లాలని అందరికీ అలవాటైపోయింది.

తీవ్రంగా స్థలాల కొరత
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. రైతుబజార్లను అన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు స్థలాల కొరత తీవ్రంగా ఉండటంతో 100 మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయబోతున్నారు. అన్ని ప్రధాన నగరాల్లో ఇవి ప్రారంభం కాబోతున్నాయి.
ప్రస్తుతం గుంటూరు, విజయవాడ నగరాల్లో 16 రైతు బజార్లు ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో 100 మొబైల్ రైతుబజార్లను ప్రారంభిస్తామని రైతుబజార్ల సీఈవో శేఖర్ బాబు తెలిపారు. కర్నూలు, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గంటూరు లాంటి నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, అపార్ట్ మెంట్లలో నివసించే ప్రజల కోసం వీటిని అందుబాటులోకి తెస్తున్నారు.
రాష్ట్రంలో 111 రైతు బజార్లు
ఏపీలో ప్రస్తుతం 111 రైతుబజార్లు ఉన్నాయి. మదనపల్లి, ఆత్మకూరు, వెలుగోడు, ఆళ్లగడ్డ, పత్తికొండ, ప్రొద్దుటూరు, వేంపల్లి, బాపట్ల, రాయవరం, అంగర, అనపర్తి, సాలూరుల్లో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి పురపాలక సంఘంలో రైతుబజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 98 మున్సిపాలీటీలుటే కేవలం 74 చోట్లే రైతుబజార్లు ఉన్నాయి.
కరోనా సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం కూరగాయలను విక్రయించింది. వీటిని జనతా బజార్ పేరుతో నడపాలని చూసినప్పటికీ విజయవంతం కాలేదు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికోసం కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారా? లేదంటే పాత ఆర్టీసీ బస్సులను వినియోగిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications