తిరుమల లడ్డూ, జగన్ డిక్లరేషన్ వివాదాల మధ్య చంద్రబాబు కీలక నిర్ణయం
Chandrababu: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు.. మతం రంగును పులుముకొన్నాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనె వాడుతున్నారనే వివాదానికి పుల్‌స్టాప్ పడక ముందే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెర మీదికొచ్చింది.
హామీల అమలు..
ఈ రెండింటి మీదే తప్ప పాలనా పరమైన అంశాలేవీ చర్చకు రావట్లేదు చాలా రోజులుగా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అమలు చేస్తానన్న సూపర్ 6 గ్యారంటీలు సహా ఇంకేదీ వార్తల్లో ఉండట్లేదు.

మరోసారి అప్పు..
ఈ పరిణాల మధ్య మరోసారి చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం అప్పులకెళ్లింది. ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వాటి విలువ 3,000 కోట్ల రూపాయలు. అక్టోబర్ 1వ తేదీన ఇవి వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది.
మూడు బాండ్లు..
కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది రిజర్వ్ బ్యాంక్. 1,000 కోట్ల రూపాయల విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లను వేలం పాటకు పెట్టింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది. ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 14, మరొకటి- 20, ఇంకొకటి-24 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు.
అధికారంలోకి వచ్చాక..
అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది అయిదోసారి. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో 2,000 కోట్ల రూపాయల చొప్పున బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే.
అప్పుల భారం..
ఆ తరువాత మరో 5,000 కోట్ల రూపాయల సమీకరణకు పూనుకుంది. మూడో విడతలో 2,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరించింది. నాలుగో విడతలో మరో 3,000 కోట్ల రూపాయల సమీకరించింది. అప్పటికే ఈ మొత్తం కలిపి 12,000 కోట్ల రూపాయలు రుణభారం రాష్ట్ర ప్రజలపై పడినట్టయింది.

వేల కోట్లు..
ఇప్పుడు తాజాగా మరో 3,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్. రుణభారం మొత్తం 15,000 కోట్ల రూపాయలకు పెరిగింది. కాగా- ఏపీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి.
ఈ రాష్ట్రాలు కూడా..
ఇందులో.. అస్సాం- రూ. 750 కోట్లు, బిహార్- 2,000 కోట్లు, గోవా- రూ. 100 కోట్లు, హర్యానా- రూ.1,500, కర్ణాటక- రూ.4,000 కోట్లు, కేరళ- 1,245 కోట్లు, మేఘాలయా- 197 కోట్లు, పంజాబ్- 1,150 కోట్లు, రాజస్థాన్- రూ.500 కోట్లు, పశ్చిమ బెంగాల్- రూ.3,500 కోట్ల రూపాయల మేర విలువ చేసే సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి.
తెలంగాణ సైతం..
తెలంగాణ సైతం ఆదాయ వనరులను సమీకరించుకోవడానికి సెక్యూరిటీ బాండ్ల వేలంపైనే ఆధారపడింది. 2,000 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను వేలానికి పెట్టింది. మొత్తంగా ఆయా ప్రభుత్వాల నుంచి 19,942 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలం వేయనుంది.












Click it and Unblock the Notifications