గుంటూరుజిల్లాలో గ్రాండ్ సక్సెస్: ఇక గొడుగుతో వస్తేనే: మద్యం షాపుల వద్ద అంబ్రెల్లా ఫార్ములా
గుంటూరు: కరోనా వైరస్ తమ చుట్టూ ఆవరించుకుని ఉందని తెలిసినా.. దాని బారిన పడితే ప్రాణాలకు గ్యారంటీ ఉండదనే విషయాన్ని మర్చిపోయారు మందుబాబులు. మద్యం దుకాణాలు తెరచుకోవడమే ఆలస్యం.. వాటిపై ఎగబడ్డారు. ఫూటుగా తాగేశారు. తన్నుకున్నారు.. తోసుకున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి ఉంటుందనే నిబంధనను అమలు చేసినప్పటికీ పట్టించుకోలేదు. మందు బోటిల్ చేతిలో పడితే చాలనే విధంగా ప్రవర్తించారు. గుంపులు కట్టారు. చాలాచోట్ల మాస్కులు కూడా ధరించలేదు. మంు కోసం కనీస ముందుజాగ్రత్తలను గాలికి వదిలేశారు.

సరిహద్దు జిల్లాల నుంచీ భారీగా..
44 రోజుల లాక్‌డౌన్ తరువాత తొలిసారిగా మద్యం దుకాణాలు తెరచుకోవడంతో ఏపీ సహా దేశవ్యాప్తంగా కనిపించిన దృశ్యాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. కరోనా వైరస్‌ను మరింత విస్తరింపజేస్తాయనే భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ఏ ఒక్క వ్యక్తి ఆ గుంపులో ఉన్నా.. దాదాపుగా పదుల సంఖ్యలో వ్యాప్తి చెందడానికి కారణమౌతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దు గ్రామాలకు.. కరోనా కేసుల సంఖ్య భారీగా ఉంటోన్న తమిళనాడు నుంచి మందుబాబులు పోటెత్తడం మరింత ప్రమాదకర పరిస్థితులకు దారి తీయడానికి కారణం కావచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమౌతున్నాయి.

గొడుగులతో వస్తేనే..
ఇలాంటి పరిస్థితుల మధ్య మద్యం అమ్మకాలను కొనసాగించడానికి ఓ వినూత్న ఫార్ములాను తెరమీదికి తీసుకొచ్చారు. అదే అంబ్రెల్లా ఫార్ములా. గుంటూరు జిల్లా తెనాలిలో ఒకట్రెండు మద్యం దుకాణాల వద్ద దీన్ని ప్రయోగించారు. గొడుగులను పట్టుకుని వచ్చిన వారికి మాత్రమే మద్యాన్ని విక్రయిస్తామంటూ షాపు యజమానులు నిబంధన విధించడం వల్ల ఎలాంటి జనం తాకిడి గానీ, తొక్కిసలాట గానీ చోటు చేసుకోలేదు. గొడుగును తీసుకొచ్చిన వ్యక్తికి వ్యక్తికి మధ్య సహజంగానే రెండు అడుగుల దూరం ఏర్పడుతుంది. ఫలితంగా- సోషల్ డిస్టెన్సింగ్‌ను అనుసరించడం సులభతరమైంది.
అంబ్రెల్లా ఫార్ములాను అన్నిచోట్లా..
ఇదివరకు విశాఖపట్నంలో.. అనంతరం కేరళలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కేరళలోని కోజికోడ్ వంటి జిల్లాల్లో దుకాణాల వద్ద గొడుగులతో వెళ్లడాన్నితప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. ఫలితంగా సోషల్ డిస్టెన్సింగ్‌ను ప్రత్యేకంగా అనుసరించాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే తరహా విధానాన్ని ఇదివరకు విశాఖపట్నంలోనూ అమలు చేశారు. రైతు బజార్లలో గొడుగులతో సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించిన సందర్భాలు ఉన్నాయి. అదే తరహా ఫార్ములాను ఇకపై మద్యం దుకాణాల వద్ద కూడా అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. సోషల్ డిస్టెన్సింగ్‌ను అనుసరించడానికి గొడుగులతో వెళ్లిన వారికే మద్యాన్ని ఇస్తామనే నిబంధనను ప్రవేశపెట్టాలని అంటున్నారు.