స్వైన్ ప్లూ: విశాఖలో బాలుడికి నిర్ధారణ, అప్రమత్తం
విశాఖపట్నం: విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు స్వైన్ ప్లూ అనుమానిత బాలురలో ఒకరికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు స్వైన్ ప్లూ పాజిటివ్‌గా నివేదిక రావడంతో ఆసుపత్రి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
విశాఖపట్నంలో తొలి స్వైన్ ప్లూ కేసు ఇదే కావడం విశేషం. స్వైన్ ప్లూ కేసులకు వైద్యం అందించేదుకు ఆసుపత్రిలో ఆరు పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు అనుమానిత లక్షణాలతో ఈ వార్డులో చేరారు.

వీరిలో ఒకరికి వ్యాధి నిర్ధారణ కాగా, మరొకరి నివేదిక రావాల్సి ఉంది. పెదవాల్తేరు నుంచి బుధవారం ఒర బాలుడు స్వైన్ ప్లూ అనుమానిత లక్షణాలతో వచ్చాడని కింగ్ జార్జి పర్యవేక్షక వైధ్యాధికారి డాక్టర్ ఎం. మధుసూధనబాబు తెలిపారు. స్వైన్ ప్లూ వార్డులో కేంద్రీకృత ఆక్సిజన్ సరఫరా వ్యవస్ధతో పాటు వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచామన్నారు.
స్వైన్ ప్లూ రోగులకు వైద్య పరీక్షలు చేసేందుకు వైద్యులకు, నర్సులకు ప్రత్యేకంగా 350 వ్యక్తిగత కిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలో స్వైన్ ప్లూ కేసు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
స్వైన్ ప్లూతో అందరూ అప్రమత్తంగా ఉండాలి
స్వైన్ ప్లూ కేసు నమోదైన నేపథ్యంలో విశాఖ వాసులు అప్రమత్తంగా ఉండాలని కింగ్ జార్జి ఆసుపత్రి పిల్లల విభాగ ప్రొఫెసర్ డాక్టర్ పి. వేణుగోపాల్ తెలిపారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలతో వారం రోజులుకు పైగా బాధపడేవారు తక్షణం వైద్యులను సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications