AP: ఒకేసారి 1.11 లక్షల ఉద్యోగాలు, సౌర విద్యుత్ హబ్‌గా సీమ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన 16వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ ఊతాన్ని ఇచ్చింది. ఈ సమావేశంలో సుమారు రూ. 39,436 కోట్ల విలువైన 31 భారీ ప్రాజెక్టులకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా రాయలసీమను సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడం, అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ తయారీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
రాయలసీమ జిల్లాల్లో ఉన్న అపారమైన సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం, ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా అత్యాధునిక ట్రాన్స్‌మిషన్ లైన్లను సిద్ధం చేయాలని సూచించింది. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి జరుగుతున్నా గ్రిడ్ అనుసంధానత లేక ఇబ్బందులు పడుతున్నారని, ఏపీలో అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

అమరావతి క్వాంటం వ్యాలీ - ఐటీ..
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటం టవర్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. క్వాంటం వ్యాలీలో మూడు ప్రముఖ సంస్థల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఐటీ రంగంలో విశాఖపట్నానికి పెద్దపీట వేస్తూ ఇన్ఫోసిస్ (రూ. 750 కోట్లు, 7000 ఉద్యోగాలు), క్రెడెన్స్ రియాలిటీ వంటి సంస్థల ప్రతిపాదనలను ఆమోదించారు. అలాగే, ఏపీని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC)లకు కేంద్రంగా మార్చాలని, శ్రీసిటీ, కొప్పర్తి, అనంతపురంలలో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు- ఫుడ్ ప్రాసెసింగ్..
వ్యవసాయం, ఆక్వా కల్చర్ రంగాల్లో వచ్చే వ్యర్థాలను సద్వినియోగం చేస్తూ ఇథనాల్ వంటి బై-ప్రొడక్ట్స్ తయారు చేసే ప్రాజెక్టులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఉద్యాన ఉత్పత్తుల సామర్థ్యాన్ని 200 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 400 లక్షలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనికి తగ్గట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగితేనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని బోర్డు అభిప్రాయపడింది. ఇండస్ కాఫీ, రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ వంటి సంస్థలు సుమారు రూ. 1,222 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు (SOP)..
ఇటీవల బాణసంచా యూనిట్లలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, పారిశ్రామిక భద్రతపై ముఖ్యమంత్రి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఫార్మా, స్టీల్, గ్రీన్ ఎనర్జీ వంటి భారీ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) సిద్ధం చేయాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలకు లోబడి పారిశ్రామిక యూనిట్లు ఆధునిక భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని, ఉల్లంఘనల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications