బంగాళాఖాతంలో ద్రోణి- ఏపీలో ఈదురుగాలులతో వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

ఆ తరువాత మళ్లీ రుతు పవనాలు బ్రేక్ తీసుకున్నాయి. వాటి కదలికలు మందగించాయి. ఫలితంగా- ఎండ తీవ్రత మళ్లీ మొదటికొచ్చింది. 40 డిగ్రీలకుపైగా ఎండ తీవ్రత కనిపించింది. వేడిగాలులూ వీచాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరికి గురి అయ్యారు. నడివేసవి పరిస్థితులను చవి చూశారు.
ఇప్పుడీ పరిస్థితి నుంచి ఉపశమనం లభించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలతో సహా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనావేసింది.
బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేసింది విపత్తు నిర్వహణ సంస్థ. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని కోరింది.
తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొంది. పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications