జెస్సికా కోసం కొలంబియాకు వెళ్లిన తెలుగు యువకుడు అనుమానాస్పద మృతి
అమరావతి: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు అనామానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఆయన స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొలంబియాలో జి.కొండూరుకు చెందిన బేతపూడి సుధీర్ కుమార్ అనుమానాస్పదంగా మరణించాడు.
ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో స్పెయిన్ దేశంలో సుధీర్ కుమార్ అలియాస్ జోషి ఉన్నత చదువులు పూర్తి చేశాడు. పది రోజుల క్రితం జి.కొండూరు నుంచి స్పెయిన్ వెళ్తున్నానని చెప్పి సుధీర్ బయల్దేరాడు. ఆ తర్వాత సోదరి జ్యోత్స్నకు ఫోన్ చేసి స్నేహితురాలు జెస్సికా పుట్టిన రోజు వేడుకలకు వెళ్తున్నానని.. సర్‌ప్రైజ్ ఇస్తున్నానిన సుధీర్ చెప్పినట్లు తెలిసింది.

స్నేహితురాలు జెస్సికా పుట్టినరోజు వేడుకల కోసం కొలంబియా వెళ్లిన సుధీర్ కానరాని లోకాలకు వెళ్లిపోయినట్లు మృతుడి సోదరి తెలిపారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. సుధీర్, జెస్సికా గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. వారిద్దరి మధ్య గత మూడు నెలలుగా మనస్పర్థలు ఉన్నాయని సోదరి తెలిపింది.
ఆత్మహత్య చేసుకుని సుధీర్ మృతి చెందాడని.. ఐదు రోజుల క్రితం జెస్సికా ఫోన్ చేసి తనకు చెప్పినట్లు సుధీర్ సోదరి జ్యోత్స్న తెలిలిపింది. చనిపోయే ముందు భారతదేశంలో తన సోదరుడితో సుధీర్ మాట్లాడుతున్న వీడియో జ్యోత్స్నకు జెస్సికా పంపింది. ఆ తర్వాత సుధీర్ చనిపోయినట్లు తెలిసింది.
అయితే, సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అతడ్ని హత్య చేశారా? అనేది అనుమానాస్పదంగా మారింది. సుధీర్ చనిపోయి ఐదురోజులు గడుస్తున్నప్పటికీ.. కుటుంబసభ్యులకు చివరి చూపు దక్కలేదు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కూడా ఆర్థిక స్థోమత లేదంటూ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుధీర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications