ఏపీలో మన మిత్ర- డెడ్ లైన్ పెట్టిన నారా లోకేష్
Mana Mitra WatsApp Governence: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.
వివిధ రకాల సేవలు, సర్టిఫికెట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక తప్పినట్టయింది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలనాపరమైన సంస్కరణలకు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్ తెర తీసింది. ఈ క్రమంలో జనవరి 18వ తేదీన వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది.

దీన్ని మరింత విస్తరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం వాట్సప్ ద్వారా 161 రకాల సేవలు అందుబాటులో ఉంటోన్నాయి. వీటిని 500లకు పెంచాలంటూ ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వారికి సూచనలు ఇచ్చారు.
కొత్త రేషన్ కార్డులను కూడా వాట్సప్ ద్వారానే జారీ చేస్తామంటూ గతంలో ఐటీ శాఖ మంత్ర నారా లోకేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులకు సూచనలు సైతం అప్పట్లోనే జారీ చేశారాయన. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను 45 రోజుల్లోనే ఈ కసరత్తు పూర్తి చేస్తామనీ అన్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీపై అటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పష్టతనిచ్చారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన రేషన్ కార్డులను త్వరలోనే ఇవ్వబోతోన్నామని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇకేవైసీ నిబంధనలను పూర్తి చేస్తామని చెప్పారు.
దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ డెడ్ లైన్ పెట్టారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి 500 రకాల సేవలను ఖచ్చితంగా అమలు చేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆయా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేశారు.
వచ్చే 100 రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్-అనేబుల్డ్ సేవలను ప్రారంభిస్తామని నారా లోకేష్ అన్నారు. తదుపరి అసెంబ్లీ సమావేశాల నాటికి దీనికి అవసరమైన సవరణలను చేస్తామని పేర్కొన్నారు. ప్ర్రభుత్వ సేవలన్నింటినీ కూడా మరింత సులభంగా ప్రజలకు అందే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ప్రైవేట్ తరహాలోనే పాలన కూడా అందుబాటులో ఉండాలని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్లను బుక్ చేసుకోవడం లేదా ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్- డెలివరీ తరహాలో ఎందుకు సులభతరం కాకూడదని ప్రజలు కోరుకుంటోన్నారని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అదే తరహాలో ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications