ఘోర పడవ ప్రమాదం.. 40 మందికి పైగా చిన్నారులు మృతి.. పలువురు గల్లంతు..!
నైజీరియాలోని సొకోటో రాష్ట్రంలో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. పడవ మునిగి 40 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఇప్పటివరకూ సహాయకబృందాలు 40 మంది చిన్నారుల మృత దేహాలను వెలికి తీశాయి. మిగతా వారికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నేషనల్ ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీకు చెందిన ఏరియా మేనేజర్ అబ్దుల్ ఖాదిర్ యూసుఫ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ రియటర్స్ కు ఇచ్చిన సందేశంలో మాట్లాడుతూ.." ఈ దారుణమైన ఘటనలో ఇప్పటివరకూ దాదాపు 40 మందికిపైగా చిన్నారుల మృతదేహాలను వెలికి తీశాం. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టాం.. అన్నారు.
వీళ్లంతా రైస్ ప్లాంటింగ్ లేదా హార్వెస్టింగ్ కు బోటులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పెద్దలతో పిల్లలు కూడా రావడంతో బోటులో రద్దీ అధికం అయింది. అధిక బరువు కారణంగా పడవ ఓ పక్కకు ఒరిగి పోయి మునిగింది.. అని ఖాదిర్ యూసుఫ్ పేర్కొన్నారు. ప్రమాద సమయంలో దాదాపు 70 మందికి పైగా పడవలో ఉన్నారని స్థానికుడు నసీర్ గోరావు తెలిపాడు. స్థానికంగా ఉన్న డైవర్లు కూడా గాలింపు చర్యల్లో అధికారులకు సహకరిస్తున్నారని వివరించాడు. అధిక లోడు ప్రధాన కారణం అని అన్నాడు. ఇక నైజీరియాలో ఇటీవలికాలంలో అధిక సంఖ్యలో పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి.

దేశంలో రోడ్లు సరిగ్గా లేని కారణంగా నీటి మార్గం ద్వారానే చాలా మంది ప్రయాణిస్తుంటారు. అయితే ఇదే సమయంలో పడవలు మునిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇలాంటి ఘటనే జరిగి 25 మందికి పైగా మృతి చెందారు. 52 మందితో వెళ్తున్న ఆ పడవలో మిగతా వారిని ఎట్టకేలకు స్థానికులు రక్షించారు. గతేడాది నవంబర్ లోనూ ఓ పడవ మునిగి 27 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు నీటి మార్గం గుండా ప్రయాణం అంటేనే భయపడిపోతున్నారు.












Click it and Unblock the Notifications