శ్రీసిటీ ఫార్మా ఫ్యాక్టరీలో భారీ పేలుడు: కుప్పకూలిన ప్లాంట్: పలువురు దుర్మరణం
తిరుపతి జిల్లా శ్రీసిటీ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టిల్ హెల్త్‌కేర్ ఫార్మాసూటికల్స్ ప్లాంట్‌లో సంభవించిన భారీ పేలుడులో నలుగురు కార్మికులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో కార్మికులు విధుల్లో ఉన్న తరుణంలో ఈ భీకర పేలుడు సంభవించింది. రాత్రి వేళ విధులు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నైట్ షిఫ్ట్ కార్మికులతో పాటు, ఉదయం వేళ షిఫ్ట్ కోసం అప్పుడే విధులకు హాజరైన కార్మికులు కూడా ఆ సమయంలో ప్లాంట్‌లో ఉన్నారు. ఫార్మా కంపెనీ కావడం వల్ల పేలుడు సంభవించిన తక్షణమే అక్కడ దట్టమైన విషపూరిత పొగ వెలువడిందని, మంటలు చుట్టుముట్టాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు ధాటికి టిల్ హెల్త్ కేర్ ఫార్మా యూనిట్ లో ఓ భాగం కుప్పకూలింది.

మృతుల్లో ఒకరిని సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్ (45)గా గుర్తించారు. మరొకరు.. తమిళనాడు సరిహద్దు గ్రామం మాదరపాకం నివాసి రమేష్ (45) పోలీసులు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరు మృతుల వివరాలు తెలియరావాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే శ్రీసిటీ పోలీసులు, అత్యవసర వైద్య సేవల సిబ్బంది అంబులెన్సులతో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన కార్మికులను సమీపంలో ఆసుపత్రులకు తరలించారు.
క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, వారికి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తోన్నారు. ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రీసిటీ వంటి పారిశ్రామిక జోన్‌లో ఇలాంటి ప్రమాదం సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి స్పందించారు. ఫార్మా కంపెనీలో పేలుడు ఎలా సంభవించిందనే కోణంలో ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం సరైన రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలను పాటించిందా లేదా అనే విషయంపై ఆరా తీయాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
