తెలంగాణా ప్రజలకు ఢిల్లీకి వారధి బ్లూ బుల్లెట్ .. తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 50ఏళ్ళ ప్రస్థానం
మనల్ని నిత్యం ఇతర ప్రాంతాలకు సురక్షితంగా రవాణా చేసే రవాణా సాధనాలలో ప్రధానమైనవి రైళ్ళు. అటువంటి రైళ్లకు చరిత్ర ఉంటుంది. దశాబ్దాలుగా అనేక రైళ్ళు మనల్ని గమ్య స్థానాలకు చేరుస్తూ ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. అలాంటి రైళ్ళలో ప్రయాణికులు బ్లూ బుల్లెట్ గా పిలుచుకున్న తెలంగాణా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఒకటి.
నేడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దేశ రాజధాని న్యూఢిల్లీతో కలిపే తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1976 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ రైలు, ఐదు దశాబ్దాలుగా లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది.అప్పటి కాలంలో ఈ రైలును 'ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్'గా పిలిచేవారు. కేంద్ర రైల్వే మంత్రి మధు దండావతే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళ్‌రావు చేతులమీదుగా ఈ రైలుకు సికింద్రాబాద్‌లో ప్రారంభమైంది.

తొలుత 14 బోగీలతో, వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే నడిచేది. స్టీమ్ ఇంజిన్‌తో ప్రారంభమై, తర్వాత డీజిల్ ఇంజిన్‌కు మారింది. ఆక్స్‌ఫర్డ్ బ్లూ రంగు కోచ్‌లు, బంగారు గీత కారణంగా ప్రయాణికులు దీన్ని 'బ్లూ బుల్లెట్' అని అభిమానంగా పిలుచుకునేవారు. కాలం గడిచే కొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో వారానికి మూడు రోజులకు సేవలు పెంచారు. 1991 నుంచి ప్రతిరోజూ నడపడం మొదలైంది.
బోగీల సంఖ్య కూడా 24కు పెరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2015 నవంబర్ 15న ఈ రైలు పేరును అధికారికంగా తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. 2019లో పాత కోచ్‌ల స్థానంలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అమర్చి, మరింత సౌకర్యవంతం చేశారు. ప్రస్తుతం ఈ రైలు హైదరాబాద్ దక్కన్ నుంచి న్యూఢిల్లీ వరకు దాదాపు 1,677 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 26 గంటల్లో చేరుకుంటుంది.
తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లతో వివిధ వర్గాల ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ఆధునిక రైళ్లు వచ్చినప్పటికీ, తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ రైలును ఇప్పటికీ ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన రైళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మార్పులు చూసినా, తెలంగాణ ప్రజలకు ఢిల్లీతో అనుసంధానం కలిపే ముఖ్యమైన వారధిగా ఈ రైలు కొనసాగుతోంది. నేడు ఈ చారిత్రక మైలురాయిని జరుపుకుంటూ, రైల్వే అధికారులు, ప్రయాణికులు ఈ రైలు సేవలను స్మరించుకుంటున్నారు. ముందు ముందు భవిష్యత్ లో కూడా ఇదే విధంగా తెలంగాణా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సేవలు అందించాలని అందరూ ఆశిస్తున్నారు.














Click it and Unblock the Notifications
