తెలంగాణ పబ్లిక్ స్కూల్స్.. పేద విద్యార్థులకు వరం.. కానీ పూర్తయ్యేది ఎప్పుడో..?

నేటి బాలలే రేపటి పౌరులు.. విద్య లేనివాడు వింత పశువు అనే సూక్తులు మనం వింటుంటాం. ప్రపంచాన్ని మార్చాలంటే మీరు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని నెల్సన్ మండేలా అన్న సూక్తి మనకు తెలిసిందే. పిల్లలందరూ దేశానికి సంపద లాంటి వారు.. భారతదేశ భవిష్యత్ మూలస్తంభాలకు వారే కీలకం. అందుకే చిన్నారులకు మెరుగైన విద్య సౌకర్యాలను అందించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న ఏకైక లక్ష్యం. అటు అక్షరాస్యతను ప్రాథమిక మానవ హక్కుగా యునెస్కో ఎప్పుడో గుర్తించింది. ఇక ప్రస్తుతం వికసిత్ భారత్ దిశగా మనదేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధికి అక్షరాస్యత నిజమైన పునాది లాంటిది. అందుకోసమే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక కీలక మార్పులను తీసుకొచ్చింది. ఎప్పటినుంచో ఉన్న 10+2 విద్యా విధానానికి స్వస్తి చెప్పి పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తూ 5+3+3+4 విధానాన్ని తీసుకొచ్చింది.

అలాగే మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాథమిక విద్యలో 5 వ తరగతి వరకు వీలైతే 8 వ తరగతి వరకు విద్యార్థులకు బోధన మాతృభాషలోనే లేదా ప్రాంతీయ భాషలోనే జరగాలని నూతన విద్యా విధానం చెబుతోంది. ఇక తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం మెరుగైన సౌకర్యాలను అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను, కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు ధీటుగా నిర్మిస్తూ అన్ని వసతులను ఏర్పాటు చేస్తోంది. ఇక తెలంగాణలో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమమే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం. ఈ సంచలన నిర్ణయం ద్వారా ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, కార్పొరేట్ స్థాయి విద్యను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.

ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో డిజిటల్ తరగతులు, లైబ్రరీలు, క్రీడా మైదానాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ ను అందించనున్నారు. అంతేకాక విద్యార్థులు పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు స్కూల్ బస్సులను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు రాష్ట్రంలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంఖ్యను రానున్న కాలంలో మరింత పెంచనున్నారు. ఇక ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక్కో పాఠశాలను సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఒక్కో టీపీఎస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న సమీపంలోని ప్రభుత్వ పాఠశాలను ఇందులో విలీనం చేసి ఒకే చోట ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా ఉంది.

ఇక ప్రభుత్వం టీపీఎస్ స్కూల్స్ ను ఏర్పాటు చేయడంపై నూతన్ కల్ మండలానికి చెందిన వంశీ అనే ఉపాధ్యాయుడు వన్ ఇండియాతో మాట్లాడుతూ.. టీపీఎస్ స్కూల్స్ వల్ల విద్యార్థుల భవితవ్యం మారుతుందని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ఈ పాఠశాలలను ఏర్పాటు చేయడం కారణంగా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో సబ్జెక్ట్ కు ఒక టీచర్ లేరని.. 1-5 వ తరగతి విద్యార్థులందరినీ ఒకే గదిలో కూర్చొబెట్టి ఒకే టీచర్ తో పాఠాలు చెబుతున్నామని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రాథమిక పాఠశాలలకు వసతులు మెరగైనట్లు వివరించారు. పాఠశాలకు రంగులు వేశారు. కొత్త ఫర్నీచర్ అందించారని తెలిపారు. ఇలాంటి చిన్న చిన్న పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాటిని టీపీఎస్ లలో విలీనం చేయాలని కోరారు.

ఇక నూతనకల్ మండలానికే చెందిన సాయి కుమార్ అనే డిగ్రీ విద్యార్థి వన్ ఇండియాతో మాట్లాడుతూ.. తాను ప్రభుత్వ పాఠశాలలోనే 10 వ తరగతి వరకు చదివానని అప్పుడు ఇన్ని వసతులు లేవని తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని అన్నాడు. తమకు కేవలం కంప్యూటర్ క్లాస్ లు మాత్రమే చెప్పేవారని కానీ ఇప్పుడు డిజిటల్ బోధన ఎంతో మెరుగైందని అన్నాడు. ఇక తమ డిగ్రీ కాలేజీలో ప్రభుత్వం మధ్యాహ్న భోజనం లేదని.. ఇతర డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారని తెలిపాడు.

Telangana Public Schools government provides free quality corporate level education poor students

మరోవైపు నవీన అనే ఇంటర్ విద్యార్థిని వన్ ఇండియాతో మాట్లాడుతూ.. తాను టెన్త్ వరకు నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదివానని తెలిపింది. అయితే తమకు సరైన ప్లే గ్రౌండ్ కూడా ఉండేది కాదని.. ఫీజులు మాత్రం అధికంగా తీసుకునేవారని వివరించింది. ప్రభుత్వం తీసుకొస్తున్న టీపీఎస్ లతో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని పేర్కొంది. ప్రతి మండలానికి ఇలాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉంటే తాము ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్లే వాళ్లం కాదని తెలిపింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+