ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

ఆ తరువాత మళ్లీ రుతు పవనాలు బ్రేక్ తీసుకున్నాయి. వాటి కదలికలు మందగించాయి. ఫలితంగా- ఎండ తీవ్రత మళ్లీ మొదటికొచ్చింది. 40 డిగ్రీలకుపైగా ఎండ తీవ్రత కనిపించింది. వేడిగాలులూ వీచాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరికి గురి అయ్యారు. నడివేసవి పరిస్థితులను చవి చూశారు.
ఇప్పుడీ పరిస్థితి నుంచి ఉపశమనం లభించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం లేకపోలేదు.
బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేసింది విపత్తు నిర్వహణ సంస్థ. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని కోరింది.












Click it and Unblock the Notifications