టీనేజర్ల వ్యాక్సినేషన్ లో ఏపీ రికార్డు-మూడు రోజుల్లో 53 శాతం- ఇండియాలోనే టాప్
దేశవ్యాప్తంగా టీనేజర్లకు ఈ నెల 2 నుంచి వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతకు కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తోంది. దీంతో జాతీయ సగటుకు మూడు రెట్ల వేగంతో ఏపీలో ఈ ప్రక్రియ సాగుతోంది.
Recommended Video
ఏపీలో 15 నుంచి 18 ఏళ్ల మద్య యువత 24.41 లక్షలుగా గుర్తించారు. వీరిలో గత మూడు రోజుల్లోనే 53 శాతం మందికి అంటే 13 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయడం పూర్తయింది. మిగతా వారికి కూడా ఈ వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో పెద్దలతో పోలిస్తే యువతలో అవగాహన ఎక్కువగా ఉందని టీనేజర్లు మరోసారి నిరూపించారు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఏపీ నమోదు చేసిన 53 శాతం వ్యాక్సినేషన్ జాతీయస్ధాయిలో టాప్ లో ఉండటమే కాకుండా రికార్డులు కూడా సృష్టిస్తోంది.

టీనేజర్ల వ్యాక్సినేషన్ లో ఏపీ 53 శాతంతో ప్రథమ స్ధానంలో ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ 49.98 శాతంతో ద్వితీయ స్ధానంలో నిలిచింది. టీనేజర్ల వ్యాక్సినేషన్ లో జాతీయ సగటు కేవలం 17.13 శాతంగా నమోదవుతోంది. ఏపీలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. జిల్లాల వారీగా అత్యధిక శాతాల్ని పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో అథ్యధికంగా 76 శాతం మంది టీనేజర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కృష్ణాజిల్లాలో 65 శాతం, తూర్పుగోదావరిలో 64 శాతం, చిత్తూరులో 59 శాతం మంది టీకా వేయించుకున్నారు. మిగతా జిల్లాలు కూడా దాదాపు 50 శాతానికి చేరువలో ఉన్నాయి. దీంతో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ఏపీ వేగంగా అడుగులేస్తోంది.












Click it and Unblock the Notifications