ఆంధ్రుల ఆత్మాభిమానం జైల్లో ఉంది: వంగలపూడి అనిత, పరిటాల సునీత ఫైర్!!
టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన విషయం తెలిసిందే. కక్షసాధింపు చర్యలో భాగంగా వైసిపి ప్రభుత్వం, చంద్రబాబును అరెస్టు చేయించిందని తెలుగుదేశం పార్టీ నాటి నుంచి ఆందోళనలు కొనసాగిస్తోంది. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా నేడు గాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే అంటూ మరో నిరసన దీక్షకు టిడిపి శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు చంద్రబాబు అరెస్టుపై, జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మాజీ మంత్రి, టిడిపి మహిళా నేత వంగలపూడి అనిత రాజమండ్రిలో నిర్వహిస్తున్న సత్యమేవ జయతే నిరసన దీక్షలో జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. చంద్రబాబుపై అవినీతి మరక వేసి సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు.

చంద్రబాబు కోసం ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి న్యాయం కోసం దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబానికి అండగా ఉంటామని వంగలపూడి అనిత తెలిపారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని పేర్కొన్న వంగలపూడి అనిత లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు మాజీ మంత్రి పరిటాల సునీత సత్యమేవ జయతే దీక్షలో భాగంగా చంద్రబాబు అరెస్ట్ పై మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సిండికేట్ నగర్ లో దీక్షకు దిగిన పరిటాల సునీత న్యాయం జైల్లో ఉందని అన్యాయం యధేచ్ఛగా బయట తిరుగుతోందని విమర్శించారు. లక్షల కోట్ల అవినీతి చేసి బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి జగన్ అంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ సర్కార్ ఈరోజు జైల్లో పెట్టింది చంద్రబాబు గారిని మాత్రమే కాదు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కూడా చెరలో పెట్టింది. - సత్యమేవ జయతే దీక్షా వేదికపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత#SatyamevaJayateDeeksha#GandhiJayanti#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan… pic.twitter.com/w0d7428Wrs
— Telugu Desam Party (@JaiTDP) October 2, 2023
ఏ తప్పు చేయకుండా చంద్రబాబును జైల్లో పెట్టి హింసిస్తున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. బాబాయ్ ని హత్య చేసిన వ్యక్తిని సి.బి.ఐ అరెస్టు చేయలేకపోయిందని పరిటాల సునీత పేర్కొన్నారు. ఒక వ్యక్తి అవినీతి చేసి బయట తిరుగుతున్నాడని, ఇంకో వ్యక్తి బాబాయిని చంపి తప్పించుకున్నాడని పరిటాల సునీత ఆరోపించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని పదేపదే చెప్పారని, ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని పరిటాల సునీత పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications