జనసేన పొత్తు వీరితోనే ? త్వరలో పవన్ ప్రకటన- నాగబాబు క్లారిటీ..
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగట్టే పనిలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో పొత్తుల ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తామనే సంకేతాలు ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ ఈ మేరకు రెండుసార్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి చర్చలు కూడా జరిపారు. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు కొనసాగిస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో పొత్తుల ప్రకటనకు పవన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సోదరుడు నాగబాబు కర్నూల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
వీర మహిళలు, జనసైనికులతో ఏర్పాటు చేసిన భేటీల్లో పాల్గొనేందుకు కర్నూలు వచ్చిన నాగబాబు వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. వైసీపీ ఒక పార్టీయేనా.. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరమహిళలు, జన సైనికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని ఆయన వెల్లడించారు.గ్రామ స్థాయి నుంచి జన సైనికులు బలంగా వున్నారన్న నాగబాబు.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇంఛార్జీలను నియమించాలన్నారు.

మరోవైపు పొత్తుల వ్యవహారంపై జరుగుతున్న చర్చపైనా నాగబాబు స్పందించారు. త్వరలోనే పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని నాగబాబు స్పష్టం చేశారు. పొత్తులు ఖరారు తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు. తద్వారా పవన్ పొత్తులపై స్పష్టంగానే ఉన్నారని, త్వరలో ఈ మేరకు ప్రకటన కూడా చేయబోతున్నట్లు నాగబాబు సంకేతాలు ఇచ్చేశారు. ఆ తర్వాత సీట్ల పంపకాలపైనా క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications