మాజీ మంత్రి దేవినేని ఉమాపై మరో కేసు .. ఆ నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆయనపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది . ఈ నెల 16వ తేదీన టిడిపి పిలుపుమేరకు మైలవరంలో టిడిపి కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన కరోనా మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని దేవినేని ఉమాపై కేసు నమోదు
వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అయ్యప్ప నగర్ లో ఉన్న ప్రభుత్వ ఇళ్ల స్థలాలు దేవినేని ఉమ పరిశీలించారు .అయితే దేవినేని ఉమా తన వెంట ఎక్కువ మంది టిడిపి కార్యకర్తలను, నేతలను తీసుకొని వెళ్లి కోవిడ్ నిబంధనలు పాటించలేదని, సామాజిక దూరాన్ని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు అభియోగం మోపుతూ దేవినేని ఉమా పై కేసు నమోదు చేశారు.

గతంలోనూ వీడియో మార్ఫింగ్ కేసు పెట్టిన సిఐడీ అధికారులు
అదే రోజు తాసిల్దార్ కు వినతిపత్రం కూడా సమర్పించారు. అయితే టిడిపి నేతలు కరోనా నిబంధనలు పాటించకుండా వ్యవహరించారని, నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు . సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసు నమోదు చేసినట్లు గా సమాచారం. అంతకు ముందు దేవినేని ఉమా పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో మార్ఫింగ్ చేసిన వ్యవహారంలో సిఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటున్న టీడీపీ
అయితే టిడిపి నేతలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు రాజకీయ కక్షతో దేవినేని ఉమా పై కోవిడ్ నిబంధనల పేరుతో కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తప్పుడు కేసులు పెట్టటం మామూలైపోయింది అని ఆయన పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ టిడిపి నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications