పీఆర్సీ..పెరుగుతున్న గ్యాప్ - ఉద్యోగ సంఘాల ఆందోళన బాట : నేడు కార్యాచరణ ఖరారు..!!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం రోజులో మలుపు తీసుకుంటుంది. ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనల దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే తొలి సారి సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి అప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఇక, పీఆర్సీ తో పాటుగా పెండింగ్ డీఏలు..అదే విధంగా అమలు చేయాల్సిన అంశాల పైన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు చేస్తుండటంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచారు.

పీఆర్సీ పీఠముడి.. పరిష్కారమెప్పుడు
దీంతో..గత నెలలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఉద్యోగ సంఘాలకు అక్టోబర్ నెలాఖరులోగా పీఆర్సీ అంశం పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ పీఆర్సీ తేల్చలేదు. దీంతో..ముందుగా తమకు పీఆర్సీ నివేదిక అయినా ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 13 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశమని.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం కొద్ది రోజుల తేడాతో రెండో సారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది.

నిరసనలకు సిద్దమవుతున్న ఉద్యోగ సంఘాలు
అయితే, తాము కోరిన విధంగా పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవటంతో హాజరైన 13 సంఘాల్లో తొమ్మది సంఘాలు సమావేశాన్ని బహిష్కరించాయి. ఉద్యోగ సంఘాల నేతలు గతం కంటే భిన్నంగా వాయిస్ పెంచుతున్నారు. ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుంటేనే పీఆర్సీ సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఈ రోజు సమావేశం అవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు.

కార్యాచరణ ప్రకటిస్తామంటున్న నేతలు
జిల్లాల వారీగా ముందుగా నిరసనలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, పీఆర్సీ పైన ప్రభుత్వం ప్రకటించిన అధ్యయన కమిటీ ఇప్పటి వరకు ఒక్క సారి కూడా సామవేశం కాలేదు. అయితే, ప్రభుత్వం సైతం రాష్ట్రంలో అర్దిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సహకరించాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరుతోంది. తాజాగా జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలోనూ ఏది తేలలేదు. 27 శాతమే ఫిట్ మెంట్ ఇస్తారని కొందరు.. 30 శాతానికి ఫైనల్ అవుతుందంటూ మరి కొందరు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఖరి పైన కొన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నాయి.
Recommended Video

ప్రభుత్వ స్పందన పైనే ఆసక్తి
ప్రభుత్వ తీరును తప్పు బడుతున్నాయి. మరి కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి. కొన్ని ఉద్యోగ సంఘాలు తమ మైలేజ్ కోసమే విమర్శలు చేస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వినతులే చేస్తున్న వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు ఆందోళనలకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజున తమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ జేఏసీ నేతలు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని..ఆందోళనలు అవసరం ఉండదని చెబుతోంది. దీంతో..ఈ రోజున ఉద్యోగ సంఘాల నేతలు తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications