వరుస అల్పపీడనాలు, కుండపోత వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. వాతావరణ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటుగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో వరుస అల్ప పీడనాలు ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 25న ఏర్పడే అల్ప పీడనం 27న దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో.. ఉత్తర కోస్తా, యానాంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

భారీ వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీని ప్రభావంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంటూరు నగరపు చుట్టుపక్కల భారీ వర్షం కురిసింది.
గంటకుపైగా కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. తెలంగాణలోనూ సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగా రెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications