పిఠాపురంలో ఎన్నికల బరిలో మరో పవన్ కళ్యాణ్.. వైఎస్ జగన్ వ్యూహమేనా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలలో తన సత్తా చాటాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించటానికి వైసిపి ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కు వరుస షాకులు తగులుతున్నాయి.
జనసేనకు వరుస కష్టాలు
జనసేన ఎన్నికలగుర్తు అయిన గాజుగ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ గా ప్రకటించడంతో మొదలైన ఇబ్బందులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ జగన్ పై ల్యాండ్ గ్రాబర్, స్కామ్ స్టార్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి
ఇక ఇదే సమయంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఢిల్లీ వెళ్లి మరీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకోవాలని బెదిరిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పిఠాపురంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది.
పిఠాపురంలో పోటీలో మరో పవన్ కళ్యాణ్
పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తారని జనసేన వర్గాలు భావిస్తుంటే, తాజాగా ఆయనకు అతిపెద్ద సమస్య వచ్చి పడింది. పిఠాపురం నియోజకవర్గం నుండి కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థి బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. ఈయన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది.
గాజుగ్లాసును పోలిన బకెట్ గుర్తుపై పోటీ.. జనసేనకు టెన్షన్
నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ కావడంతో ఇది గాజు గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉండడంతో ప్రస్తుతం పిఠాపురంలోని జనసైనికులకు ఆందోళన మొదలైంది. పేరు, గుర్తు రెండు దగ్గరగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కు బదులుగా, ఓటర్లు కన్ఫ్యూజ్ అయి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారేమో అని జనసేన నేతలు ఆందోళన పడుతున్నారు.
వైసీపీ కుట్ర, జగన్ ప్లాన్ అంటున్న జనసైనికులు
ఇదంతా వైసిపి కుట్రగా వారు మండిపడుతున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న వైసిపి అధినేత వైయస్ జగన్ వ్యూహమని జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. అందుకే కావాలని గుర్తుతో పాటు పవన్ కళ్యాణ్ పేరున్న వ్యక్తిని కూడా రంగంలోకి దించుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications