లింగా సినిమాకు కొత్త సమస్య:హెచ్‌ఆర్‌సీలో భట్రాజు సంఘం పిటిషన్
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగా సినిమాకు మరో కొత్త సమస్య వచ్చింది. లింగా సినిమాపై మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు భట్రాజు కుల సంఘం నాయకులు. రజనీకాంత్ లింగా సినిమాలో తమ కులాన్ని కించపరిచేలా చిత్రీకరించారని భట్రాజు కుల సంఘం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.
లింగా సినిమా నిర్మాత, రచయితపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరింది. సినిమా విడుదలైన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో లింగా చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద సోమవారం ఆ కుల సంఘం నాయకులు ధర్నా చేశారు. భట్రాజు కుల సంఘం నాయకులు ఇదే విషయంపై ఆదివారం హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ భామ అనుష్క శెట్టి నటించారు. విడుదలకు ముందు కూడా లింగా సినిమా వివాదాల్లో చిక్కుకుంది.
షూటింగ్ సమయంలోనూ లింగాకు అడ్డంకులు తప్పలేదు. రంగారెడ్డి జిల్లాలోని అనాజ్‌పూర్ గ్రామంలో ప్రజలు రజనీకాంత్ లింగా సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. దాని వెనక కారణమేమిటనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. రామోజీ ఫిల్మ్ సిటీలో లింగా షూటింగ్ జరుగుతోంది. లింగా షూటింగ్ కోసం చెరువులో రసాయనాలు కలుపుతున్నారని, దానివల్ల నీరు కలుషితమవుతోందని విమర్శించారు.
నీటి పారుదల శాఖ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి తాము అనుమతి తీసుకున్నామని సినిమా యూనిట్ చెప్పినా ప్రజలు వినలేదు. ఎన్ని అడ్డంకులను తట్టుకుని లింగా సినిమా రజనీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగితి తెలిసిందే.












Click it and Unblock the Notifications