లాకర్లా...బంగారం దుకాణాలా?:ఎసిబికి పట్టుబడ్డ వెంకటరావు వైభోగం...వట్టి ఆభరణాలే రూ.3 కోట్లు
విశాఖపట్నం:ఎసిబి దాడిలో పట్టుబడిన విశాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) శరగడం వెంకటరావుకు సంబంధించిన లాకర్లలో తాజాగా బైటపడ్డ ఆభరణాలు, ఆస్తులు చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తుపోయారు.
కారణం ఆ లాకర్ల నిండా వివిధ రకాల ఆభరణాలతో జ్యూయలరీ షాపును తలపిస్తుండటమే. ముక్కుపుడక మొదలుకొని వడ్రాణాల దాకా అన్ని వెరైటీలతో నిండిపోయివుండటమే. ఆ ఆభరణాల విలువే రూ.3 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందంటే అతని అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం 5 లాకర్లలో ఇప్పటికి 3 ఓపెన్ చేయగా వీటిలో కేవలం నగలే కాకుండా మరికొన్ని ఆస్థి పత్రాలు కూడా లభ్యమయ్యాయి...మరో రెండు లాకర్లను నేడు తెరవనున్నారు.

విశాఖ ఏఎంవీఐ వెంకటరావు లాకర్లలో ఏకంగా జ్యూవెలరీ దుకాణాన్నే పెట్టేసిన వైనం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. బంగారం దుకాణాల్లో ఏ విధంగా నెక్లెసులు, గాజులు, చెవి రింగులు, ఉంగరాలు, ముక్కుపుడకలు, జడపాయలు, వడ్డాణం, దండవంకీలు, హారం, గొలుసులు ఇలా రకరకాల వెరైటీల ఆభరణాలు ఉంటాయో... ఇదిగో అచ్చంగా అదే తీరులో వెంకటరావు కూడా తన లాకర్లను బంగారు, వెండి ఆభరణాలు వస్తువులతో నింపేశాడు.
లాకర్లలో ఆ వైభోగాన్నిచూసిన ఏసిబి అధికారులే..."బాబోయ్...! వెంకటరావు మాములోడు కాదు"...అనుకున్నారంటే పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వెంకటరావుతోపాటు అతని కుటుంబసభ్యులు, స్నేహితుల ఇళ్లపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి మార్కెట్ వ్యాల్యూ ప్రకారం సుమారు రూ.50కోట్ల విలువైన ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే.
ఆ సోదాలలో వెంకటరావుకు 5 లాకర్లు ఉన్నట్లు తెలియగా...అవి విశాఖ మురళీనగర్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 2లాకర్లు, ఊర్వశి ఎస్‌బీఐ బ్రాంచిలో ఒకటి, మర్రిపాలెం విశాఖ కోఆపరేటివ్ బ్యాంకులో ఒకటి, అక్కయ్యపాలెం గౌరీ కోఆపరేటివ్ బ్యాంకులో ఒకటి చొప్పున ఉన్నట్లు గుర్తించారు. ఈ 5 లాకర్లలో మూడింటిని సోమవారం తెరిచారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని రెండు లాకర్లు కలిపి 1.8 కిలోల బంగారం వస్తువులు, ఎస్‌బీఐ లాకర్‌లో 1.3 కిలోల బంగారం, 10కిలోల వెండి వస్తువులు బయటపడ్డాయి. కరాసలో 400 గజాల ఖాళీ స్థలం, మరో రెండు ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు కూడా ఈ లాకర్లలో లభ్యమయ్యాయి. మంగళవారం మిగిలిన రెండు లాకర్లను తెరిచే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications