మేయర్ అనురాధ దంపతుల హత్య: చింటూ తలదాచుకుంది ఎక్కడ?
చిత్తూరు: చిత్తూరు మేయరు కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ను హత్య చేసిన తర్వాత ప్రధాన నిందితు శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఎక్కడ తలదాచుకున్నాడనే విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. గత నెల 17వ తేదీన హత్య జరగగా 21వ తేదీ నుంచి చింటూ పుంగనూరులోనే తల దాచుకున్నట్లు అనుమానిస్తున్నారు.
చింటూకు ఓ ప్రముఖ నేత ఆశ్రయం కల్పించినట్లు భావిస్తున్నారు. పుంగనూరు ప్రాంతానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు చింటూకు ఆశ్రయం కల్పించి, న్యాయవాదిని పరిచయం చేసినట్లు పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆ న్యాయవాదిని, ఆ రాజకీయ నేత అనుచరులను విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ రాజకీయ నేత అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
రాజకీయ నాయకుడి అనుచరులను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి ఓ పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మేయర్ దంపతుల హత్య తర్వాత చింటూ తిరుత్తణి మీదిగా చెన్నైకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు అనుమతితో తమ అదుపులోకి తీసుకుని చింటూను మంగళవారంనుంచి విచారిస్తున్నారు.

చింటూ చెన్నై నుంచి 21వ తేదీన పుంగనూరు వచ్చినట్లు, లొంగిపోయే వరకు అక్కడే ఉన్నట్లు విచారణలో తేలినట్లు చెబుతున్నారు. ఆ రాజకీయ నేత సోమల సమీపంలో తనకు గల వ్యవసాయ క్షేత్రంలో చింటూకు ఆశ్రయం కల్పించినట్లు చెబుతున్నారు. చింటూకు కాపలాగా ముగ్గురు అనుచరులను పెట్టినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరికి పిస్టల్ కూడా ఇచ్చాడని అంటున్నారు.
చింటూ దండుపాళెంలోని ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ పుంగనూరుకు, ముళబాగల్, కోలార్ వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. ఓ రోజు సాయంత్రం పుంగనూరు పట్టణంలోని ఓ కోనేరు వద్ద టోపీ, షార్ట్, టీ షర్ట్ ధఱించి గడిపినట్లు చెబుతున్నారు.
అక్కడ ఉన్నన్ని రోజులు తమిళనాడు రిజిస్టేషన్‌తో ఉన్న కారును వాడినట్లు చెబుతున్నారు. పుంగనూరు పోలీసులు ఆ వ్యవహారంపై ఆరా తీస్తూ న్యాయవాదిని, రాజకీయ నేత అనుచరులను విచారించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications