ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం-జూలైలో సమీక్ష
ఏపీలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కేసుల నేపథ్యంలో విద్యాశాఖ పూర్తిస్దాయిలో పనిచేసేందుకు వీల్లేకుండా పోవడం, పరీక్షల నిర్వహణకు కనీసం నెల రోజుల గడువు కావాలని కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే పరీక్షలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. టెన్త్ పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.

Recommended Video
హైకోర్టు విచారణ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. జూలైలో మరోసారి దీనిపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది. జూన్ చివరి నాటికి కరోనా కేసులు తగ్గుతాయని భావిస్తున్న నేపథ్యంలో జూలైలో టెన్త్ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో టెన్త్ పరీక్షలపై సస్పెన్స్ మరికొంతకాలం కొనసాగే అవకాశముంది. కరోనా పరిస్ధితుల్లో పరీక్షలు రద్దుచేయాలని ఇప్పటికే విపక్షాలతో పాటు విద్యార్ధుల తల్లితండ్రుల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications