దంచికొడుతున్న భారీ వర్షాలు- స్తంభించిన జన జీవనం : మరో రెండు రోజులు అలర్ట్..!!
భారీ వర్షాలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తం అవుతోంది. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు..కాల్వలు పలుచోట్ల తెగిపోయాయి. అధికార యంత్రంగా సహాయక చర్యలు ప్రారంభించింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలు..ఈదురు గాలులు
ఏపీలోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కిలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లాలోని రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేటలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

కడప జిల్లాలో పొంగుతున్న వాగులు
రాయచోటిలో 7 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి.. పలు గ్రామాలకు పాక్షికంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, టమోటా, బొప్పాయి, అరటి, చీని పంటలకు నష్టం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసి..ఈ ఉదయం నుంచి తిరిగి ప్రారంభించారు. ఇవాళ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

తిరుపతిలో కుండపోత..ఘాట్ రోడ్డుపై ప్రభావం
చంద్రగిరిలో భీమా, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. నాగయ్యగారిపల్లి వద్ద వంతెన కొట్టుకుపోయింది. దీంతో 20 గ్రామాలకు రాకపోలకు నిలిచిపోయాయి.. ఇక, తుఫాను హెచ్చరికలతో ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.. సముద్రతీర ప్రాంతం ఉన్న 11 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను అప్రమత్తం చేశారు.. తీరంలో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 11 మండలాల్లో 40 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

నెల్లూరు ప్రకాశంలో అప్రమత్తంగా
అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి..కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో తుఫాను కారణంగా సోమశిల జలాశయానికి భారీగా వరద పెరిగింది.. ఎగువ నుండి 46,945 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా నేడు, రేపు విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సెలవు ప్రకటించారు . మరోవైపు, వర్షాల కారణంగా మూడువేల ఏకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. వర్షాలు తగ్గు ముఖంపడితే పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.
Recommended Video

మరో రెండు రోజుల భారీ వర్ష సూచన
ఇక, అనంతపురం జిల్లా కూడా వర్షాలు కురుస్తున్నాయి. తాడిపత్రి మండలంలో 10.6 మిల్లీ మీటర్లు, పుట్లూరు మండలంలో 16.6 మిల్లీ మీటర్లు, పెద్దపప్పూరులో 3.2 మిల్లి మీటర్లు, పెద్దవడుగూరులో 14.6 మిల్లి మీటర్లు, యల్లనూరులో 24.4 మిల్లి మీటర్లు, యాడికి మండలంలో 10.4 ఎంఎం వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తమవుతున్నారు. మరో 48 గంటల పాటు తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications