వైసీపీ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తారా?: అసెంబ్లీ నిరవధిక వాయిదా
శాసనసభ నిరవధిక వాయిదా
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు వైసీపీ సభ్యుల తీరుతో నిరవధికంగా వాయిదా పడ్డాయి.
చెప్పులతో బెంచీలు ఎక్కిన వారిపై చర్యలు తీసుకోవాలి: యమనల
చెప్పులతో బెంచీలు ఎక్కిన వారిపై చర్యలు తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల అన్నారు. అసెంబ్లీలో చెప్పులతో బెంచీలు ఎక్కి నిలబడటం దారుణమన్నారు. అవసరమైతే సభ్యులను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని స్పీకర్ కోడెలకు సూచించారు.
ఈరోజు చాలా బాధాకరమైన రోజు: ధూళిపాళ్ల నరేంద్ర
ఈరోజు చాలా బాధాకరమైన రోజు అని టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సభలో చర్చకు వైసీపీ ముందుకు రావడం లేదన్నారు. ప్రతిపక్షం చర్చించడానికి రాకూండా సభలో అరచకాన్ని సృష్టిస్తోందన్నారు. ప్రతిపక్ష బాధ్యత ఏంటంటే రాష్ట్రంలోని సమస్యలు చర్చించాలని ఇక్కడికి పంపిస్తే వీళ్ల తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. సమైక్య ఏపీలో కూడా ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వైసీపీ సభ్యుల తీరు మాత్రం చాలా దారుణంగా ఉందన్నారు.

బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ
మహిళా సభ్యులు మహిళా మార్షల్స్ ను కూడా ఇబ్బంది పెట్టారని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. అందరూ బాధ పడతున్న గౌరవ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం చిరునవ్వుతో చూస్తూన్నారన్నారు. ప్రపంచం మొత్తం చూస్తోందని, వైసీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని సూచించారు. వైసీపీ సభ్యులను సస్పెండ్ చేయకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందన్నారు.
యనమల ప్రకటన
34 ఏళ్లుగా శాసనసభలో ఉన్నానని, ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలను చూడలేదని శాసనసభా వ్యవహారల మంత్రి యనమల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు దౌర్జన్య కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులకు కనీస మర్యాదలు లేవన్నారు. మూడు రోజుల్లో సభను మూడు నిమిషాలు కూడా జరగనివ్వలేదన్నారు. వైసీపీ సభ్యులను తీరుని ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీలో ఫోన్లు, స్పీకర్‌పై దాడి, బల్లలను విరగకొట్టడం లాంటివి చేస్తున్నారు కాబట్టి వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. సంతాప తీర్మానానికి కూడా వైసీపీ సభ్యులు మద్దతివ్వని పరిస్థితి ఉందన్నారు. మార్షల్స్‌ను అడ్డుపెట్టుకుని సభ నడపాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. వైసీపీ సభ్యుల దురుసు ప్రవర్తనకు జగన్ బాధ్యత వహించాలన్నారు. దీనికి గాను వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రివిలైజ్ కమిటీకి సిఫారసు చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
సెక్రటరీ బెంచ్ ఎక్కిన వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సెక్రటరీ బెంచ్ ఎక్కి నుంచున్నారు. సభలో వైసీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. కాగితాలు చించి స్పీకర్ పోడియం పైకి విసిరారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టిన వైసీపీ సభ్యులు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరు అప్రజాస్వామ్యకంగా ఉందన్నారు.

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభ
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. రోజా క్షమాపణ లేఖను స్పీకర్ కోడెల సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం సభ ముందు ఉంచారు. వైసీపీ సభ్యులు ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. సభ్యులు కూర్చోవాలని స్పీకర్ సూచించారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు.
10 నిమిషాలు అసెంబ్లీ వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా మూడో రోజు అదే సీన్ రిపీట్ అయింది. వరుసగా మూడో రోజు కూడా స్పీకర్ పోడియంను వైసీపీ సభ్యులు చుట్టు ముట్టి ప్లకార్డులు ప్రదర్శించారు. క్వశ్చన్ అవర్‌ను సైతం వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. సభ మొదలైనప్పటి నుంచి వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.
ఒకనొక సమయంలో మహిళా మార్షల్స్‌పై దాడి, దౌర్జన్యం సరికాదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు హెచ్చరించినా వైసీపీ సభ్యులు ఆందోళనలు చేశారు. దీంతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీరుని స్పీకర్ తప్పుబట్టారు. దీంతో చివరకు స్పీకర్ సభను పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.
జగన్ చెప్పినట్లు సభ నడవదు: స్పీకర్
సభ నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. ఈ సందర్భంగా వైసీపీ తీరుపై స్పీకర్ కోడెల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ''జగన్ చెప్పినట్లు సభ నడవదు. నియమనిబంధనల ప్రకారం సభ నిర్వహిస్తాం. సభ్యులు తమ ప్రవర్తనను అవలోకనం చేసుకోవాలి'' అని సూచించారు.

మహిళా మార్షల్స్‌ను కొట్టడం సరికాదు: వైసీపీ సభ్యులపై స్పీకర్
మూడో రోజు కూడా స్పీకర్ కోడెల వైసీపీ సభ్యుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవార సమావేశాల్లో పోడియంను చుట్టుముట్టిన వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... మార్షల్స్ పై దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తాజాగా నేటి సమావేశాల్లోనూ ఆయన ఇదే తరహాలో మరో వ్యాఖ్య చేశారు. సభలో ఉద్రిక్త పరిస్థితులను అణచివేసేందుకు రంగంలోకి దిగిన మహిళా మార్షల్స్ పై దాడి చేయడం సరికాదని ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు.
జగన్‌పై నిప్పులు చెరిగిన బొండా
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీరుపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. అసలు మీకేం కావాలంటూ బొండా ఉమా అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. సభలో హెల్మెట్లు పెట్టుకుని కూర్చోవాల్సిన దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. స్పీకర్ తన రక్షణ కోసం మార్షల్స్‌ను పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జగన్ ది ఫ్యాక్షన్ మెంటాలిటీ అన్న బొండా జగన్ మూర్ఖత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు.
అసెంబ్లీ కార్యదర్శిని చంపడానికి వైసీపీ సభ్యులు యత్నించారని ఆయన ఆరోపించారు. సీట్లోనే కూర్చున్న జగన్ తన పార్టీ సభ్యులను స్పీకర్ పైకి ఉసిగిలుపుతున్నారన్నారు. ''అసలు మీకేం కావాలో చెప్పండి. ప్రత్యేక హోదాపై చర్చకావాలా లేక రాయలసీమపై చర్చ కావాలా? లేదంటే కరువుపై చర్చ కావాలా? దేనికైనా మేం సిద్ధం. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను పది రోజులైనా పొడిగించుకుందాం'' అంటూ బొండా ఉమా అన్నారు.
స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైసీపీ సభ్యులు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు శనివారం సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గడచిన రెండు రోజుల మాదిరే నల్ల రంగు చొక్కాలతో సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టారు. ఆ పార్టీ పురుష ఎమ్మెల్యేలతో పాటు మహిళా సభ్యులు కూడా ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో అప్పటికే వైసీపీ సభ్యులను కంట్రోల్ చేసేందుకు పురుష మార్షల్స్ రంగంలోకి దిగగా, మహిళా మార్షల్స్ కూడా రంగంలోకి దిగారు.
వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి: అచ్చెన్నాయుడు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభలో ప్రసంగించిన కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సభను అడ్డుకుంటూ సభా మర్యాదలను గంగలో కలిపిన వైసీపీ సభ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్‌ను కోరారు. అసెంబ్లీ గౌరవ మర్యాదలను కాపాడాలంటే వైసీపీ సభ్యులపై చర్యలే తీసుకోవాలన్నారు. అచ్చెన్నాయుడు డిమాండ్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications